నమస్తే నెట్వర్క్, జూన్ 22 ; ‘తెలంగాణ రాక ముందు కరెంట్ కష్టాల గురించి చెప్పుకుంట పోతే ముచ్చట ఒడవది. ఒకటా.. రెండా.. ఎన్నో కష్టాలు పడ్డం. అప్పుడు 2014కి ముందు సక్కగ ఇయ్యక ఎంత ఆగమైనమో ఇంకా మరిచిపోలే. రాత్రిపూట కరెంటుతో రైతులు ఎంతమంది సచ్చిపోయిన్రో లెక్కేలేదు. ఒక్క రైతులే కాదు.. కరెంటును నమ్ముకొని పనిచేసేటోళ్లమంతా అరిగోస పడ్డం. మళ్ల కేసీఆర్ పుణ్యమా అని 24గంటల కరెంట్, పుష్కలంగా నీళ్లిచ్చినంక తొవ్వకచ్చినం. గిట్ల మా రంది తీర్చి కష్టాలు దూరం చేసిన కేసీఆర్‌ను పట్టుకొని ఇప్పుడొచ్చిన కాంగ్రెసోళ్లు బద్నాం చేయడం మంచిది కాదు.. పాలన సక్కగ చెయ్యక.. పాత కష్టాలన్నీ ముందర పెట్టుకుంట ఆయనను అనుడు పద్ధతి కాదు.. ఆయన ఏం చేసిండో.. ఎట్ల చేసిండో కానీ, రాష్ట్రం మంచిగైందనేది మాత్రం నిజం’ అని సబ్బండ వర్గాల ప్రజలు కుండబద్దలు కొట్టి చెప్పారు.
కేసీఆర్ హయాంల కరెంట్ పోవుడన్న ముచ్చటే లేదు
మహదేవపూర్ : నాకు రెండెకరాల భూమి ఉంది. వ్యవసాయమే మాకు జీవనాధారం. నాడు కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతులకు నాణ్యమైన కరెంట్ అందింది. గడిచిన పదేండ్లలో ఏనాడూ కోతలన్న ముచ్చటే లేదు. రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకున్నరు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు అత్తదో.. ఎప్పుడు పోతదో అర్థంకాని పరిస్థితి దాపురించింది. గిట్లయితే రైతులు వ్యవసాయం చేసినట్టే. కరెంట్ సక్కగ లేకుంటే పంటలకు నీళ్లు ఎట్ల అందుతయ్. గతంల పంటలకు మంచిగ వచ్చినయి.. పథకాలు టైంకు అందినయి. గిప్పుడు కరెంట్ సమస్యతోటి మళ్లా మునుపటి పరిస్థితే కనబడతాంది. తెలంగాణ రాకముందు నిరంతరం కరెంట్ కోతలతో రైతులకు కన్నీళ్లు తప్ప ఏం మిగిలేది కాదు. గట్లాంటి పరిస్థితుల్లో రైతులు సంతోషంగా బతకాలని అప్పటి సీఎం కేసీఆర్ కరెంట్ కష్టాలు లేకుండ చేసేందుకే పక్క రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి అందించిండు. గసొంటి గొప్ప నాయకుడిని కాంగ్రెసోళ్లు తప్పు పట్టడం మంచిదికాదు. కేసీఆర్‌తోనే రైతులందరికి న్యాయం జరిగింది.
– ఎండీ సలీం ఖాన్, రైతు, మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మోటర్ల కాడ కాపలా ఉన్నం
వెంకటాపురం (నూగూరు) జూన్ 22 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పంటలకు నీళ్లు పెట్టుకునేందుకు మోటర్ల కాడ అర్ధరాత్రులు కాపలా పడుకున్నం. ఎప్పుడు అత్తదో ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితుల్లో కరెంట్ కోసం ఎదురుచూసుకుంట పురుగు, పుట్ర బారిన పడెటోళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ను అందించిండు. అప్పటి సంది రాత్రి పూట బాయిలకాడికి పోయే తిప్పలు తప్పింది. మళ్లా కాంగ్రెస్ పాలనలో కరెంట్ సమస్య ఎన్కటి కాలాన్ని గుర్తుకు తెస్తాంది. ఇప్పుడే గిట్లుంటే ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడాల్నో అర్థమైతలేదు. రాష్ట్రంల ఒక్కరు కూడా ఇబ్బంది పడొద్దని ఎక్కడి నుంచే కరెంటు కొనుక్కొచ్చి ఇత్తే కాంగ్రెసోళ్లు ఉన్న దానిని సక్కగ చెయ్యక కేసీఆర్ మీద బురదజల్లుడు సరైంది కాదు.
– గడ్డం వివేక్, రైతు, వెంకటాపురం (నూగూరు)
రోజుకు రూ. 200 నష్టపోతున్నం..
హనుమకొండ, జూన్ 22 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పడ్డ కరెంటు కష్టాలు మళ్లీ మొదలైనయ్. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క రోజూ కరెంటు పోలేదు. ఇప్పుడు రోజుకు రెండు, మూడు సార్లు కరెంటు పోయి వస్తున్నది. టైంకు బ ట్టలు ఇస్తిరి చేసి ఇచ్చుడు జరగక కస్టమర్ల నుంచి మాకు ఇ బ్బందులు వస్తున్నయి. కేసీఆర్ సార్ 24 గంటలు కరెంటు ఇచ్చినపుడు ఆదాయం బాగా ఉండేది. ఆయన ఎక్కడి నుంచి తెచ్చిండో తెల్వదు కాని కరెంటు పోకపోవడంతో మాకు మస్తు లాభమైంది. ప్రస్తుతం కరెంటు కోతలతో రూ. 200 వరకు ఆదాయం తగ్గడంతో కుటుంబం బతకడం కూడా ఇబ్బందిగా మారే ప్రమాదం ఉన్నది.
– నెల్లుట్ల సారంగం, ఇస్త్రీ షాప్, మచిలీబజార్, హనుమకొండ
మళ్లీ కష్టాలు మొదలైనయ్..
గూడూరు, జూన్ 22 : ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరెంటు కష్టాలు మళ్లీ చూస్తున్నం. అప్పటి సమై క్యాంధ్ర నాయకుడు తెలంగాణకు కరంట్ ఇవ్వం, నీళ్లివ్వం అని కర్ర చూపిస్తూ చెప్పిన మాటలు మళ్లీ ఈ ప్రభుత్వంలో నిజమవుతున్నయి. నిజంగానే కరెంట్, నీళ్లు ఉంటలేవు. తెలంగాణ రాకముందు వ్యవసాయం చేయాలంటే అనేక కష్టాలు పడ్డం.. రాత్రి పూట ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పొ లం కాడికి పోవాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చినంక కరెంటు, నీళ్లు పుష్కలంగా లభించినయి. ఆడుతూ పాడుతూ వ్యవసాయం చేసుకునేటోళ్లం. కేసీఆర్ సీఎం అయిన తరువాతనే పాకాల వాగుపై మా ప్రాంతంలో చెక్‌డ్యాంలు కట్టి నీళ్లందించిండు. గ తంలో కరెంట్ పోతే మేమే వైర్లు, పోల్స్ సరిచేసే ది. కేసీఆర్ సారు ప్రభుత్వంలో రెప్పపాటు కూడా కరెం ట్ పోలేదు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాక ముందే మోటర్లు కాలిపోతున్నయి. ఇక మా కు భయం మొదలైంది.
– బానోత్ నర్సింహనాయక్ రైతు, గూడూరు