హనుమకొండ, ఏప్రిల్ 24 : వేసవి తీవ్రత, వడగాలలును దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సెలువు ఇవ్వాలని అంగన్వాడీ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేసారు. ఈ మేరకు గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌అండ్ హెల్పర్స్‌యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా చేసారు. ఈ సందర్బంగా అంగన్వాడీ ఐక్యత వర్ధిల్లాలి, మే నెల సెలవులు ఇవ్వాలి, సిఐటియు జిందాబాద్, లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్నట్లుగా మే మాసం సెలువులు ఇవ్వాలన్నారు.
అలాగే అంగన్వాడీ కేంద్రాలలో మంచినీరు, మరుగుదొడ్లు, కరెంటు లాంటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు. అంగన్వాడీ ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనీ, అంగన్వాడీ ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్ర బడ్జెట్లో ఐసిడిఎస్‌కు నిధులను పెంచాలని, అంగన్ వాడీలకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, టీచర్స్‌కు రూ.32 వేలు, ఆయాలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ పి. ప్రావీణ్యకు వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి శోభారాణి, జమున, యం.అరుణ, ఆర్ సత్తెమ్మ, బానోతు తిరుమల, మమత, ప్రమీల, లక్ష్మి, ఆర్ సునీత, బి స్వరూప తదితరులు పాల్గొన్నారు.