స్టేషన్ ఘన్పూర్, మే 10 : నిబంధనలకు విరుద్ధంగా సొంతిండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంపై జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో దళితులు నిరసన తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక జాబితాను సర్వే చేసేందుకు శనివారం అధికారులు రెండు టీమ్లుగా ఏర్పడి దళితకాలనీకి వచ్చారు. వివరాలు సేకరిస్తుండగా కాలనీవాసులు పలువురు అధికారులను నిలదీశారు.
నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాల్సి ఉన్నా ఉన్నవాళ్లకే ఎలా మంజూరు చేశారంటూ మండిపడ్డారు. తాము అద్దె ఇళ్లలో ఉంటున్నా ఎందుకు ఇండ్లు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. లబ్ధిదారుల జాబితా చూపించాలని కోరగా, ఎస్సీ కాలనికి 15 ఇండ్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో ఆరు ఇండ్లు ఉన్న వారికే ఉండగా వివరాలు నమోదు చేసుకుని వెనుతిరిగారు.
పేదలకే ఇండ్లు ఇవ్వాలి సార్
పేదల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని దళిత కాలనీకి చెందిన మాతంగి జ్యోతి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషాను కోరింది. తనకు కట్నం కింద ఇంటి స్థలం ఇచ్చారని, భర్త ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడని పేర్కొంది. ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్న తమకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అయితే కాలనీ 15 మందికి ఇండ్లు మంజూరైనట్లు జాబితా ఉందని, అందులో సగం మంది అనర్హులేనని ఆరోపించారు. పేదలకే ఇండ్లు మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
– మాతంగి జ్యోతి