దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇందులో ప్రథమ పౌరుడు సర్పంచ్‌తో పాటు వార్డుసభ్యులు కీలకం. వీరిలో పల్లె ప్రగతికి బాటలు వేసి, అదృష్టం తోడై చట్ట సభల్లో అడుగు పెట్టిన వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు సర్పంచిగా, వార్డుసభ్యుడిగా పనిచేసిన వారు అనంతర కాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ వరకు వెళ్లి అమాత్యులుగా ఎదిగారు. ఇందులో ములుగు జిల్లా నుంచి ఐదుగురు ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్లగా, జగన్నాయక్, చందూలాల్ మంత్రులుగా సేవలందించారు. మరొకరు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా నుంచి సత్యవతిరాథోడ్ సర్పంచ్‌గా, జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసి ఆదర్శంగా నిలిచారు.
ములుగు, డిసెంబర్ 4(నమస్తేతెలంగాణ)/ కురవి: ములుగు అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ స్థానం ఉన్న సమయంలో వెంకటాపూర్ మండలం రామాంజాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేసిన సంతోశ్ చక్రవర్తి 1959 నుంచి 1962 వరకు ములుగు ఎమ్మెల్యేగా పనిచేశా రు. ఆ తర్వాత వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన సూర్యనేని రాజేశ్వర్‌రావు 1963లో ఎమ్మెల్యేగా ఎన్నికై 1972 వరకు కొనసాగారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన జరగగా ములుగు నియోజక వర్గం ఎస్టీ స్థానంగా కేటాయించబడింది.
1972 నుంచి 1977 వరకు ములుగు మండలం మద నపల్లి గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన పోరిక జగన్నాయక్ 1978లో మొదటి సారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. 1989 నుంచి 1990 వరకు ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన అజ్మీరా చందూలాల్ 1990లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994లో మరో మారు ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత 1995-96లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి వరంగల్ నుంచి చందూలాల్ పోటీ చేసి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో అడుగు పెట్టారు. 1980 నుంచి 1985 వరకు తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన చర్ప బోజారా వు 1996లో జరిగిన బై ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చందూలాల్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ మంత్రివర్గంలో గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలందించారు.
నాడు వ్యక్తిత్వం, సేవ చేయడమే ప్రధానం
స్థానిక ఎన్నికల్లో పొటీ చేయాలంటే నాడు వ్యక్తిత్వం.. మాటకు కట్టుబడి.. సేవచేసే వారినే ప్రజలు ఎన్నుకునేవారు. ఐదువేల ఓట్లు ఉన్న గుండ్రాతిమడుగు(విలేజ్) సర్పంచ్ ఎన్నికల్లో 1995 లో నాకు కేవలం రూ. ఐదువేల ఖర్చు వచ్చింది. ప్రస్తుతం ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. నాయకుల తీరును బట్టి ప్రజలు కూడా మారుతున్నారు. గ్రామ విభజన వల్ల గుండ్రాతిమడుగు ఐదు గ్రామాలుగా విడిపోయింది.
– మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
తండా నుంచి మంత్రి దాకా..
మారుమూల తండా నుంచి సర్పంచ్ నుంచి మంత్రి గా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ప్ర యాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. 1985లో రాజకీయ రంగంలోకి ప్రవేశించి 1995లో గుండ్రాతి మడుగు(విలేజ్) నుంచి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందింది. 200 6లో నర్సింహులపేట జడ్పీటీసీ సభ్యురాలిగా విజయం సాధించి సోషల్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమెల్సీగా ఎన్నికై అదే సంవత్సరం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు.