హనుమకొండ, నవంబర్ 11 : బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతున్నాయని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో పార్లమెంట్‌ను స్తంభింపచేయాల్సిన కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మండిపడ్డారు. కాకతీయ యూనివర్సిటీలోని ఎస్డీఎల్సీఈ ప్రాంగణంలో కేయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరేగంటి నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్మపోరాట దీక్ష కొనసాగింది.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కూరపాటి వెంకటనారాయణ దీక్షా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ.. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ప్రభుత్వంపై పోరాడకుండా చేతులు దులుపుకుంటే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. అన్ని వర్గాల వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించిన కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా దామాషా రిజర్వేషన్లను ఎందుకు కల్పించడంలేదని ఆయన ప్రశ్నించారు.
దేశ బడ్జెట్ సృష్టించేది బీసీలైతే అధికారం చేబూని బీసీలు సృష్టించిన బడ్జెట్‌ను నిలువునా దోచుకుంటున్నారని, బీసీలకు రిజర్వేషన్లను కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం బీసీలపై కక్షగట్టి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మండిపడ్డారు. బీసీ జేఏసీ నాయకులు సంఘాని మల్లేశ్వర్, కేయూ ఈసీ మెంబర్, తెలంగాణ రాష్ర్ట జేఏసీ కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్, బీసీ జేఏసీ నాయకులు ఆకుతోట శ్రీనివాస్, చీకటి శ్రీను, వేణు, మంద వీరస్వామి, వేముల మహేందర్ గౌడ్, ఏదునూరి రాజమౌళి, నాగరాజు పటేల్, నాగరాజు, సూర్య కిరణ్, అజయ్ సింగ్, అన్వేష్, నాగరాజు, రాజశేఖర్, గణేష్, నవీన్, సురేందర్, అనిల్, రవితేజ, ధర్మ పాల్గొన్నారు.