హైటెక్ తల్లిదండ్రులు తమ బిడ్డలు మరింత ‘స్మార్ట్’గా ఎదగాలని ఆశపడుతున్నారు. బాల్యం నుంచే ‘ఏఐ’తో సావాసం చేయాలని భావిస్తున్నారు. అందుకే, ఆడుకునేందుకూ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే బొమ్మల్ని కొనిపెడుతున్నారు. బుల్లిరోబోలతో తమ బిడ్డలు మాట్లాడుతుంటే చూసి మురిసిపోతున్నారు. తమ అనుమానాలను ఏఐతో నివృత్తి చేసుకుంటున్న చిన్నారులను చూసి గర్వపడుతున్నారు. అయితే, ఈ ఆధునిక ఆటబొమ్మల వెనక.. కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఏఐ బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కెమెరాలు, మైక్రోఫోన్లతో పిల్లల హావభావాలను గమనిస్తాయి. వారి మాటల్ని వింటాయి. అయితే, ఆ కెమెరాలు, మైక్రోఫోన్లు సులభంగా హ్యాకింగ్‌కు గురవుతాయి. అప్పుడు ఇంటి లోపల జరిగే విషయాలు, పిల్లల వ్యక్తిగత వివరాలు బయటి వ్యక్తులకు తెలిసే ప్రమాదం ఉంది. సాధారణ బొమ్మలతో ఆడుకునే సందర్భంలో.. పిల్లలు సొంతంగా కథలు అల్లుకుంటారు. అందుకు తగ్గట్టుగా పాత్రలను ఊహించుకుంటారు. కానీ, ఏఐ బొమ్మలు అన్నీ అవే చేసి పెడతాయి. దీనివల్ల పిల్లల్లో ‘సొంతంగా ఆలోచించే శక్తి’ తగ్గిపోతుంది. ఇక అత్యాధునిక బొమ్మలు కాబట్టి.. చిన్నారులు వాటితో గడపడానికే ఇష్టపడుతుంటారు. తోటి పిల్లలతో ఆడుకోవడానికి ఆసక్తి చూపించరు. ఫలితంగా, నిజ జీవితంలో మనుషులతో ఎలా ప్రవర్తించాలి? భావోద్వేగాలను ఎలా పంచుకోవాలి? అనే సామాజిక నైపుణ్యాలకు దూరం అవుతారు. చాలామంది పిల్లలు ఈ బొమ్మలను వస్తువులుగా కాకుండా.. స్నేహితులుగానే భావిస్తారు. దాంతో, వాటితో ఎమోషనల్గానూ కనెక్ట్ అవుతారు. ఒకవేళ సదరు బొమ్మలు పాడైపోతే.. పిల్లలు తీవ్రమైన మానసిక బాధకు గురవుతారు.
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
ఏఐ బొమ్మలతో ఆడుకుంటున్న చిన్నారులపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాల్సిందే! ముందుగా ఆ బొమ్మలకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమా? లేదా? అనేది తనిఖీ చేయాలి. బొమ్మల ప్రైవసీ పాలసీని క్షుణ్నంగా చదవాలి. పిల్లల్ని అప్పుడప్పుడూ పార్కులు, మైదానాలకు తీసుకెళ్తుండాలి. శారీరక శ్రమ కలిగేలా.. ఆటలు ఆడించాలి. క్లాస్మేట్స్తోపాటు ఇంటి చుట్టుపక్కల పిల్లలతో కలిసిపోయేలా వారిని ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లల్లో శారీరక, సామాజిక నైపుణ్యాలు మెరుగుపడుతాయి.