ఓం శాంతి శాంతి శాంతిః
ఆహా: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: ఇషా రెబ్బా, తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, రోహిణి తదితరులు,
దర్శకత్వం: ఏఆర్ సంజీవ్ భారతీయ సినీ చరిత్రలో.. మహిళా ప్రధానంగా సాగే ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. సమాజం కోసం పాటుపడిన కథానాయికల కథలెన్నో వచ్చాయి. ఈ క్రమంలో, కట్టుకున్న భర్త కష్టపెడితే.. కొందరు హీరోయిన్లు కన్నీరు పెట్టుకున్నారు. మరికొందరు కోర్టులకెక్కారు. విడాకులు పొందారు. కానీ, తాళి కట్టినవాడి తాటతీసిన నాయికలు కొందరే ఉన్నారు. ఈ మహిళా దినోత్సవాన అలాంటి ఓ యువతి కథ తెలుసుకోవాల్సిందే కదా! ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా.. ఆ యువతి స్టోరీనే! ప్రధాన పాత్రధారి ప్రశాంతి (ఈషా రెబ్బా). కథలోకి వెళ్తే.. బాగా చదువుకొని, మంచి ఉద్యోగం చేయాలని భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటుంది ప్రశాంతి.
కానీ, తన బాల్యం.. కట్టుబాట్లు, ఆంక్షలు, పరిమితుల మధ్యే సాగుతుంది. దాంతో, జీవితంపై అసహనంతో ఉంటుంది. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కోసం పరితపిస్తుంటుంది. భర్త నుంచైనా నిజమైన ప్రేమను పొందాలని భావిస్తుంది. కానీ, తప్పని పరిస్థితుల్లో పెళ్లికి సిద్ధం అవుతుంది ప్రశాంతి. పెళ్లికొడుకు చేపల వ్యాపారి ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్). పెళ్లి తర్వాత తనను చదివిస్తాడనీ, ప్రేమను పంచుతాడనీ భావించిన భర్త కూడా.. ఆమెతో మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు. అహంకారంతో తన కోపాన్నంతా భార్యపైనే ప్రదర్శిస్తుంటాడు. ఈ క్రమంలో.. ప్రశాంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? భర్తకు ఎలా ఎదురుతిరుగుతుంది? దాంతో కంగుతిన్న ఓంకార్.. ఏం చేస్తాడు? భర్తపై పోరాటం చేసిన ప్రశాంతికి.. చివరికి లభించిన ఉపశమనం ఏమిటి? ఇద్దరూ విడిపోతారా? లేక సర్దుకుపోతారా? అనే విషయాల్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!