హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 26 : విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి దేశ రాయబారులుగా నిలవాలని నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి పిలుపునిచ్చారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) నిట్లో 1245 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ప్రవేశం, ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగా చేరిన విద్యార్థులను ఆహ్వానించడం, వారికి విద్యావాతావరణం, క్యాంపస్ జీవితం, సంస్థ అందించే వివిధ అవకాశాలకు పరిచయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యమని సుబుధి అన్నారు. విద్యా విశిష్టతలో ఉన్నత ప్రమాణాలను కొనసాగించడంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో సంస్థ కట్టుబడి ఉందన్నారు. క్యాంపస్ జీవితం విద్యార్థి సహాయం సంబంధిత అంశాలు చర్చించారు.
అకాడెమిక్ నియమావళి గురించి డీన్ (అకాడెమిక్) ప్రొఫెసర్ వెంకయ్య దరి వివరించారు. విద్యార్థుల సంక్షేమం, క్యాంపస్ జీవితం గురించి డీన్ (స్టూడెంట్ వెల్ఫేర్) ప్రొఫెసర్ కె.కిరణ్కుమార్ మాట్లాడారు. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పి.హరిప్రసాద్రెడ్డి విద్యార్థి క్లబ్బులను పరిచయం చేశారు. హాస్టల్ జీవితాన్ని చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ పి.అబ్దుల్ ఆజీం వివరించారు. కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అధిపతి ప్రొఫెసర్ పి.వి.సురేష్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగావకాశాలను వివరించారు. పరీక్షా విధానాలను ప్రొఫెసర్ జి.శివకుమార్ తెలియజేశారు. అలాగే ఇనిస్టిట్యూట్ హెల్త్ సెంటర్ అధిపతి డాక్టర్ జి.రాధారుక్మిణి ఆరోగ్య సేవల గురించి వివరించారు. ప్రశ్నలు-సమాధానాల పరస్పర సంభాషణతో కార్యక్రమం ముగిసింది.