హనుమకొండ, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారీ వానల రూపంలో ప్రకృతి చేసిన గా యం కంటే సాయం అందించలేని సర్కారు తీరుతోనే వరంగల్ నగరంలోని వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. వరదలు వచ్చి వారం రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధితులను ప ట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముం పు ప్రాంతాల్లో పర్యటించి.. వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కావడంలేదు. వరదలో నష్టం జరిగిన ప్రాంతాలు ఏమిటనేది అందరికీ కనిపించినా సాయం అందించేందుకు సర్కారుకు చేతులు రావడంలేదు.
సర్వేల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప సర్వం కోల్పోయిన బాధితుల దయనీయ స్థితిని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నది. వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నది. వరంగల్ నగర పరిధిలోని తూర్పు ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు బాధితులను పట్టించుకోవడంలేదు. సీఎం వచ్చిన ఒక్కరోజు మినహా వీరంతా వరంగల్ నగరానికి దూరంగానే ఉంటున్నారు.
ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఇక్కడ ఇబ్బందుల్లో ఉంటే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వీరంతా హడావుడి చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా స్థానిక ప్రజలకు భరోసా కల్పించాల్సిన వారు కనీస బాధ్యతలు నిర్వర్తించడంలేదని వరద బాధితులు వాపోతున్నారు. మొంథా తుఫాన్ కారణంగా గత బుధవారం వచ్చిన భారీ వానలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో చెప్పలేనంత నష్టం చేశాయి. వరదల కారణంగా వరంగల్ నగరంలోని వేల ఇండ్లు మునిగిపోగా, వేల మంది సర్వం కోల్పోయారు. తినేందుకు తిండిలేని పరిస్థితి నెలకొన్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్టోబర్ 31న వరంగల్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇండ్లు మునిగిన వారికి రూ. 15 వేలు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తామని ప్రకటించారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే సీఎం తక్షణ సాయం ప్రకటన ఆచరణకు నోచుకోవడంలేదు. నిబంధనలు, సర్వేల పేరుతో అధికార యంత్రాంగం తక్షణ సాయాన్ని వాయిదా వేస్తున్నది. తుఫానుతో వచ్చిన వరదలో అన్నీ కోల్పోయిన వారు తినేందుకు తిండి సైతం లేక ఇబ్బందులు పడుతున్నారు.
వరదలు వచ్చి వారం రోజులైనా నష్టం అంచనాపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు తయారు చేయడంలేదు. వరంగల్ నగరంలో మునిగిన, కూలిపోయిన, పాక్షికంగా ధ్వంసం అయిన ఇండ్లు ఎన్ని అనేది ఇప్పటికీ తేల్చలేదు. ఆదివారం నష్టం అంచనా పని మొదలుపెట్టినట్లు అధికారులు చెప్పారు. దీని ఆధారంగా ప్రభుత్వ సాయం అందుతుందని చెబుతున్నారు. వరద బాధితులకు ప్రభుత్వ పరంగా నయా పైసా అందకపోవడంతో ఆ కుటుంబాలు సాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి.
రోడ్డెక్కిన వరద బాధితులు
వరంగల్ చౌరస్తా, నవంబర్ 6 : వరద నుంచి తమకు శాశ్వత విముక్తిని కల్పించాలని డిమాండ్ చేస్తూ హంటర్ రోడ్డు ప్రాంత ముంపు బాధితులు రోడ్డెక్కారు. గురువారం సంతోషిమాత కాలనీ, బృందావన కాలనీ, సాయి నగర్ కాలనీ, గాయత్రి కాలనీ, కాకతీయ కాలనీ, అభయాంజనేయ కాలనీ, రామన్నపేట ప్రాంతానికి చెందిన బాధితులు పోతన సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ముంపు బారిన పడి ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షం పడిందంటే భయంభయంగా బతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు.
సుందరీకరణ పేరుతో భద్రకాళి బండ్ నిర్మాణం చేపట్టడంతో వరద చెరువులోకి వెళ్లక కాలనీలను ముంచెత్తిందన్నారు. దీనికి తోడు పోతననగర్ ప్రధాన కాల్వను విస్తరణ పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఇప్పటికైనా అధి కారులు స్పందించి భద్రకాళి చెరువుకు గేట్లు ఏర్పాటు చేసి వరదను అందులోకి మళ్లించేలా చర్యలు చేపట్టి ముంపు బారి నుంచి తమకు శాశ్వత విముక్తి కల్పించాలని కోరారు. రాస్తారోకోతో ట్రాఫిక్ నిలిచిపోగా, మట్టెవాడ సీఐ కరుణాకర్‌రావు బాధితులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో చింతనూరి రవీందర్, పగడాల వెంకటేశ్వర్లు, మల్లెల సిద్దిరాములు, కుసుమ రమేశ్, తాళ్లపెల్లి రమేశ్, వంగనూరి సంజీవ్‌కుమార్, తోట శ్రీనివాసరావు, వలబోజు శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
సర్కారు ఏం చేయలే
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందలేదు. ఇంటి నిండ నీళ్లు చేరినయి. ఇంట్ల బట్టలు, బియ్యం అన్ని ముద్దయినయి. అధికారులు వచ్చి రాసుకుని పోయిండ్లు. వారం రోజులైతాంది. ఏం చేయలే. ఎవల్ని అడగాల్నో తెల్తులేదు.
– పులిశేరి సారమ్మ, సమ్మయ్యనగర్, హనుమకొండ
ఇనుప సామాన్లకు అమ్ముకున్నాం
వరదల ఇంట్ల వస్తువులు కొట్టుకుపోయినయి. ఉన్నయి కరాబైనయి. ఫ్రిడ్జి, కూలర్ అన్నీ పాత ఇనుప సామాన్ల వాళ్లకు అమ్మితే రూ.500 వచ్చినయి. ఇప్పుడు ఇంట్లో ఏమి లేకుండా అయింది. ఇంట్ల బియ్యం లేవు. సర్కారు ఏదో ఒకటి చేయాలె.
– తిరుపతి అనూష, సమ్మయ్యనగర్,హనుమకొండ