హనుమకొండ, ఏప్రిల్ 16 : తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, వారి కి తాను తోడ్పాటునందిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురసరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్, ట్రోఫీలను గురువారం హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి కేటీఆర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో గొప్ప క్రీడా పాలసీ తీ సుకురావాల్సిన అవసరం ఉన్నదని, వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తామని తెలిపారు. దాస్యం వినయన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే ఏడాది కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యం లో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ గులాబీ శ్రేణులు, కాకతీయ క్రికెట్ అకాడమీ సభ్యులను కేటీఆర్ అభినందించారు. దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఓరుగల్లు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురసరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 8 ఏండ్లుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ విన్నర్, రన్నర్‌గా నిలిచిన 51, 49వ డివిజన్ జట్లకు నగదు, ట్రోఫీని కేటీఆర్ ప్రదానం చేశారు. డిపార్ట్మెంట్ క్రికెట్లో విన్నర్‌గా నిలిచిన అంజలి కిడ్నీ కేర్ సెంటర్ హాస్పిటల్, రన్నర్‌గా నిలిచిన సంకీర్తన హాస్పిటల్ టీంకు సైతం ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో కాకతీయ క్రికెట్ అకాడమీ (కేసీఏ) ఫౌండర్ చైర్మన్ ఫారుక్ అలీ, కేసీఏ మెంబర్స్ మాజీద్, వీరు, సిరాజ్, రాజేశ్, రాంబాబు, 51వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్‌రావు, ప్రెసిడెంట్ ఫిరోజ్, నాలుగో డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.