వరంగల్, డిసెంబర్ 5 : నగర ప్రజలకు ఆట, ఆహ్లాదం భారం కానున్నది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇండోర్‌స్టేడియం, ల్యాండ్రోమార్ట్తోపాటు మ్యూజికల్ గార్డెన్‌ను ప్రైవేటీకరణ చేసే దిశగా బల్దియా పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. దీంతో మహా నగరంలో కాలక్షేపం కోసం కుటుంబంతో సహా మ్యూజికల్ గార్డెన్, భద్రకాళీ బండ్‌కు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇండోర్‌స్టేడియంలో ఎంతో మంది క్రీడాకారులు శిక్షణ పొంది జాతీయస్థాయికి ఎదిగారు. కోట్ల నిధులు వెచ్చించి పునరుద్ధరిస్తున్న మ్యూజికల్ గార్డెన్‌ను సైతం ప్రైవేటీకరణ చేయనున్నారు. సుమారు రూ. 2 కోట్ల నిధులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రజకులకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ల్యాండ్రోమార్ట్ను నిర్మించింది. దాని నిర్వహణ బాధ్యతలు రజక సంఘాలకు అప్పగించకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు అడుగులు వేస్తున్నది.
అయితే, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేయడమేంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం సరైందని కాదని నగర ప్రజలు మండిపడుతున్నారు. ఇంటి పన్నుల్లో స్పోర్ట్ సెస్ వసూళ్లు చేస్తున్న బల్దియా ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రైవేటీకరణ చేసి పైసలు దండుకోవడం వంటి ఆలోచనలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇండోర్ స్టేడియంలో లక్షల రూపాయలు వెచ్చించి సింథటిక్ బ్యాడ్మింటన్ కోర్టు, అధునిక జిమ్‌లను ఏర్పాటు చేశారు. కోచ్‌లను నియమించారు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి క్రీడాకారులకు ఆటను దూరం చేసేందుకు బల్దియా కుట్రలు చేస్తున్నది. నగర నడిబొడ్డున ఉన్న కాకతీయ మ్యూజికల్ గార్డెన్ సైతం ప్రైవేటీకరణ చేసేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. వరంగల్ నగర ప్రజలకు సాయంకాలం వేళ ఆహ్లాదం, ఆనందం భారం కానుంది.
రజకుల ఉపాధి కోసం ఆధునిక వసతులతో బీఆర్ఎస్ ప్రభుత్వ రూ.2 కోట్లతో నిర్మించిన లాండ్రోమార్ట్ రజక సంఘాలకు దూరం కానుంది. ల్యాండ్రో మార్ట్ ఇప్పుడు ప్రైవేట్‌పరం కానుంది. 2023 ఆగస్టులో అప్పటి మంత్రి కేటీఆర్ లాండ్రోమార్ట్ను ప్రారంభించారు. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రజక సంఘాలకు దీని నిర్వహణ అప్పగించాలని నిర్ణయించారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు, అత్యాధునిక వాషింగ్ పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో రజక సంఘాలకు నిర్వహణ బాధ్యత ఇస్త్తూ సర్కారు ఆసుపత్రులను అనుసంధానం చేసి లాండ్రోమార్ట్ను నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీంతో రజకులకు ఉపాధి అవకాశాలు దోరుకుతాయని పలు ఆ సంఘాల నాయకులు చెబుతున్నారు.