బచ్చన్నపేట సెప్టెంబర్ 4 : హరితహారంలో భాగంగా ప్రతి వార్డులో మొక్కలు నాటాలని, అదేవిధంగా ఎవెన్యూ ప్లాంటేషన్ 100% పూర్తి చేయాలని బచ్చన్నపేట ఎంపీడీవో మమతాబాయి సూచించారు. గురువారం ఆమె ఆలింపూర్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణలను పరిశీలించారు. అదేవిధంగా స్మశాన వాటిక, నర్సరీ, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికి ఉపయోగపడే మొక్కలు పంపిణీ చేయాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
డంపింగ్ యార్డులో సెక్రిగేషన్ జరిగే విధంగా చూడాలన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణంలో పెరిగిన మొక్కల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సీతాఫలాల చెట్లు అద్భుతంగా పెంచారని ప్రశంసించారు. ప్రతి ఇల్లు హరితవనంగా మార్చాలని సూచించారు. ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీటి సౌకర్యం మెరుగ్గా కల్పించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికి అందించడంలో ప్రత్యేక కృషి చేయాలన్నారు. అలింపూర్ గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాల్నే రేవతి గౌడ్, కారోబార్ తేలికంటి మురళి, ఫీల్డ్ అసిస్టెంట్ పాకాల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.