లింగాలఘనపురం, అక్టోబర్ 11 : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో వైద్యం అందక.. అంబులెన్సు అందుబాటులో లేక.. ఓ గర్భిణి ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన మరికుక్కల కనకమహాలక్ష్మికి శనివారం పురిటి నొప్పులు రావడం తో భర్త ఉపేందర్ లింగాలఘనపురంలోని పీహెచ్సీకి తీసుకెళ్లాడు.
వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఆశ కార్యకర్త లింగాల పద్మ ప్రాథమిక చికిత్స చేసింది. పురిటినొప్పులు తీవ్రం కావడంతో లింగాలఘనపురానికి చెందిన అంబులెన్సుకు సమాచారం ఇవ్వగా అందుబాటులో లేకపోవడంతో భర్త ఉపేందర్ ఆమెను ఆటోలో జనగామకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో నొప్పులు తీవ్రం కావడంతో భర్తే సపర్యలు చేయడంతో ఆటోలోనే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న నెల్లుట్ల ఆశ కార్యకర్త ఆటో వద్దకు చేరుకుని తల్లీ బిడ్డలను జనగామలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.