Warangal | వరంగల్ చౌరస్తా: వరంగల్ సీకేఎం హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం బాలింత ప్రాణం మీదకు వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కాశీకుంట ప్రాంతానికి చెందిన నజియా భాను(32) ఆదివారం రాత్రి సుమారు 10:30 నిమిషాలకు ప్రసూతి సేవల కోసం సీకేఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాత్రి సుమారు నాలుగు గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు బాబు జన్మించినట్లు తెలిపి, అప్పగించారు. గడిచిన ఆరు రోజులు మహిళను కుటుంబ సభ్యులకు చూపించకుండా వైద్య సేవలు కొనసాగుతున్నట్లు తెలియజేస్తూ వచ్చారు. శుక్రవారం ఉదయం నజియా బేగం ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని వెంటనే ఎంజీఎం హాస్పిటల్కి తరలించాలని వైద్యులు తొందర పెట్టడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ కేసు షీట్ అందజేయాలని కోరడంతో కేసు షీట్ పోయిందని, కావాలంటే కొత్త కేసు షీట్ రాసిస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు కంగుతిన్నారు. కేసు షీట్ పోయిందనడంతో కుటుంబసభ్యులు నజియా బేగంను వెంటనే చూపించాలని పట్టుబట్టారు. అప్పటికే నజియా బేగం పొట్ట భాగం విపరీతంగా ఉబ్బి ఉండడంతో వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హాస్పిటల్ భవనం ముందు ధర్నా చేసి, నిరసన వ్యక్తం చేశారు.