ములుగురూరల్, ఆగస్టు 3 : డెంగీతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన ములుగు జిల్లా జాకారం గ్రామంలో శనివారం జ రిగింది. గ్రామస్తుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన మంచో జు రాజేంద్రప్రసాద్‌కు ఐదేళ్ల క్రితం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అక్షిత(28)తో వివా హం జరిగింది. వీరికి మొదటి కాన్పులో కూతురు జన్మించింది. ప్రస్తుతం రెండో కాన్పు కాగా, ములుగు ప్రభుత్వ దవాఖానలో వైద్యం పొందుతున్నది. 9 నెలలు నిండిన అక్షితకు నాలుగు రోజులు గా జ్వరం రాగా, ములుగులోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందింది.
అయినా తగ్గకపోవడంతో నర్సంపేటలోని మరో ప్రైవేట్ దవాఖానలో రెండు రోజుల పాటు చికిత్స తీసుకొని నయం కాకపోవడంతో కుటంబ సభ్యులు వరంగల్‌లోని మరో ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు డెంగీతోపాటు జాండీస్ అయ్యాయని, తల్లి, బిడ్డకు ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని, శస్త్ర చికిత్స చేసి మృత మగ శిశువును బయటికి తీశారు.
అనంతరం చికిత్స పొందుతూ అక్షిత శుక్రవారం మృతి చెందింది. అక్షిత అంత్యక్రియలను శనివారం జాకారం గ్రామంలో నిర్వహించారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు మృతదేహాన్ని సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్షిత మృతితో డెంగీ జ్వరాలపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు, దోమల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.