హనుమకొండ, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతున్నది. అభివృద్ధి పనులకు నిధులు లేకుండా ప్రణాళికలు రూపొందించడం వల్ల ఉపయోగముండదనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా గతంలోనే రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలను కొనసాగించేందుకు నిధులు మంజూరు చేస్తే సరిపోయేదని, ఇప్పుడు కొత్తగా ప్రణాళికల పేరిట హడావుడి అవసరం లేదనే చర్చ జరుగుతున్నది. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు, నగరాలకు ఎన్ని అభివృద్ధి నిధులు మంజూరవుతాయనే విషయంపై స్పష్టత లేదు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలకు నిధులు ప్రస్తావన ఉండడంలేదు. పేదలకు సంక్షేమం, కొత్తగా అభివృద్ధి పనులు లేకుండా నిర్వహించే ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంతో ప్రజల్లో ప్రభుత్వంపై మరింత అసంతృప్తి పెరుగుతుందని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చర్చించుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాల వారీగా అభివృద్ధి పనులు గుర్తించి వెంటనే నిధులు మంజూరు చేస్తే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, నిధుల ప్రస్తావన లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం కొత్తగానే ఉంటున్నదని అంటున్నారు.
‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ మొదటి రోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఆరు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎప్పటిలాగానే ఈ సమావేశం మొక్కుడిగా సాగింది. ఉమ్మడి జిల్లాలోని మరో మంత్రి సీతక్క ఈ సమావేశానికి హాజరు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి సీతక్క హాజరు కాకపోవడంతో అధికారులు సైతం సీరియస్‌గా తీసుకోవడంలేదు.
మొదటి రోజు సమావేశమే ఇలా ఉంటే 99 రోజులు ఎలా ఉంటుందనే చర్చ జరుగుతున్నది. దంతాలపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రూనాయక్కు పలువురు వృద్ధులు, దివ్యాంగులు తమ బాధలు చెప్పుకొనేందుకు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. తమకు రెండేళ్ల నుంచి పింఛన్ రావడం లేదు.. ‘దండం పెడుతాం.. సార్ పింఛన్ ఇప్పించండి’ అంటూ ఆయనను వేడుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల ఆర్భాటం.., హడావుడే తప్పా ప్రజల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి కనిపించ లేదు. నిధుల మంజూరుపైనే స్పష్టత లేనప్పుడు ప్రగతి ప్రణాళికలు రూపొందించడం ఎందుకని, గతంలోనే ఉన్న వాటికే నిధులు మంజూరు చేస్తే సరిపోయేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ మొదటి రోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఆరు జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్ష ఎప్పటిలా మొక్కుబడిగానే సాగింది. మొదటి రోజు సమావేశమే ఇలా ఉంటే 99 రోజులు ఇంకెలా ఉంటుందోననే చర్చనడుస్తున్నది.