జనగామ, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)/జనగామ రూరల్/జనగామ చౌరస్తా : చినుకులన్నీ కలిసి ఏరైనట్లు.. ఏరులన్నీ ఏకమై వాగైనట్లు.. వాగులన్నీ ఒక్కటై వరద ఉప్పొంగినట్లు జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పోటెత్తారు. జననేత కేసీఆర్‌ను చూసేందుకు.. ఆయన ప్రసంగం వినేందుకు ఉత్సాహంగా.. స్వచ్ఛందంగా హాజరై మద్దతు పలికారు. నియోజకవర్గం నలుమూలలా ఏ దారి చూసినా గులాబీ శ్రేణులు కిక్కిరిసి కనిపించారు. జెండాలు, కండువాలు.. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఇలా ఎటుచూసినా పట్టణమంతా గులాబీవనాన్ని తలపించగా, పెద్ద ఎత్తున బోనాలు, బతుకమ్మలతో మహిళలు, ప్రదర్శనలతో ఒగ్గుడోలు కళాకారులు, సంప్రదాయ వస్త్రధారణతో గిరిజన మహిళలు తరలివచ్చి కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. సభలో ఏపూరి సోమన్న, కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు.
జనగామలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ ‘ప్రజా ఆశీర్వాద సభ’ ‘లక్ష’ణంగా విజయవంతమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా తొలి సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. కులవృత్తుల వేషధారణలు, కోలాటం, బతుకమ్మలు, బోనాలతో మహిళలు, ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు, చిందు, యక్షగాన కళారూపాలు, గిరిజన లంబాడా మహిళల నృత్యాలు, గొల్లకుర్మల డిల్లెం బల్లెం, ముస్లిం మర్ఫా కళాకారులు ఇలా సబ్బండ వర్గాలవారు సమూహాలుగా సాంస్కృతిక ప్రదర్శనలతో తండోపతండాలుగా తరలివచ్చి సందడి చేశారు. మేడారం సమ్మక్క జాతరకు బైలెల్లినట్లు ఊర్లకు ఊర్లే ఉదయాన్నే ఇల్లు కదిలి వచ్చినట్లు పోటెత్తారు. సభ మధ్యాహ్నం 2గంటలకు ఉండగా 11గంటల నుంచే ప్రజలు భారీగా రావడంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకే సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. పట్టణంలోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అటు వికాస్‌నగర్‌లోని హెలీప్యాడ్ చుట్టూ ఉన్న భవనాలు ఎక్కి మహిళలు, పిల్లలు, వృద్ధులు కేసీఆర్‌కు అభివాదం చేశారు. ఒకానొక దశలో సభ మొత్తం నిండిపోగా, వేలాది మంది బయటే ఉండాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలు చప్పట్లు, ఈలలతో మద్దతు పలికారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి పల్లా గెలుపు ఖాయమని తేలిపోయిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సభకు వచ్చినవారందరికీ నిర్వాహకులు అన్ని వసతులు కల్పించారు. ఎండకు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కూలర్లు ఏర్పాటు చేశారు. ఏపూరి సోమన్న, కళాకారులు ఆటపాటలతో అలరించారు.
28 నిమిషాల ప్రసంగం
మధ్యాహ్నం 3.48 గంటలకు చాపర్‌లో సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. 3.50గంటలకు చాపర్ నుంచి దిగారు. సీఎం వెంట ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వచ్చారు. 3.51 గంటలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గద్దల పద్మ నర్సింగరావు, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జల్లి సిద్ధయ్య, మండల శ్రీరాములు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. 3.55 గంటలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులో, కాన్వాయ్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 4.21గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించారు. 4.49 గంటలకు ముగించారు. 4.55 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. 5గంటలకు హెలీప్యాడ్ వద్ద సీఎం కేసీఆర్‌కు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. జనగామ పర్యటనలో సీఎం కేసీఆర్ మొత్తం 1.19గంటలు గడిపారు. 28 నిమిషాల ప్రసంగంతో సభికులను ఆకట్టుకున్నారు.
600మందితో భారీ బందోబస్తు..
వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా నేతృత్వంలో సభకు 600మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పించారు. వెస్ట్‌జోన్ డీసీపీ పీ సీతారాం, ఆరుగురు ఏసీపీలు హెలీప్యాడ్, సభా ప్రాంగణం, సభా వేదిక, వీఐపీ, మీడియా గ్యాలరీ, పార్కింగ్ ప్రాంతాల్లో భద్రత కల్పించారు. 14 మంది సీఐలు, 34 మంది ఎస్ఐలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్స్, హోంగార్డులు కట్టుదిట్టంగా విధులు నిర్వర్తించారు.
భారీ ర్యాలీతో సభకు పల్లా
వేలాది మంది ప్రజలు, కళాకారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి భారీ ర్యాలీగా సభకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ, నెహ్రూ పార్కు మీదుగా గీతానగర్‌లోని సభా ప్రాంగణం వరకు కొనసాగింది. పల్లా వెంట ఎమ్మెల్యే రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం ఉన్నారు.
‘హ్యాట్రిక్ సీఎం కేసీఆర్’..
‘హ్యాట్రిక్ సీఎం కేసీఆర్’ అంటూ ప్రజల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. పొన్నాల బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి దయాకర్‌రావు ప్రకటించి, సీఎం కేసీఆర్ కండువా కప్పుతుండగా, ముత్తిరెడ్డి, పల్లా మాట్లాడుతుండగా ప్రజలు ఈలలు, చప్పట్లతో జై తెలంగాణ.. జైజై బీఆర్ఎస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఆగం కావొద్దు.. ఆలోచనతో ఓటెయ్యాలె..
‘ఓటు అనేది ప్రజల తలరాతను, తెలంగాణ భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుంది. ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచనతో ఓటెయ్యాలె’ అని సీఎం కేసీఆర్ సూచించారు. జనగామ ప్రజా ఆశీర్వాద సభ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ఆయన, తెలంగాణలో తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని కళ్లగట్టారు.
గులాబీల జెండాలే రామక్క… జనగామ గడ్డ పల్లా అడ్డ..
‘గులాబీల జెండాలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క’ , ‘జనగామ గడ్డ.. పల్లా అడ్డ, పల్లాకు అడ్డెవడు’ అనే పాటలు సభలో మార్మోగాయి. కళాకారులు ఈ పాటలు పాడుతుంటే సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది.