హనుమకొండ చౌరస్తా : జనవరి 5,6,7 తేదీలలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే పీడీఎస్‌యూ ( PDSU ) రాష్ట్ర 23వ మహాసభల పోస్టర్లను ( Maha Sabha Posters ) కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేటు వద్ద గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మాట్లాడుతూ 1970వ దశకంలో జార్జిరెడ్డి ప్రేరణతో ఆవిర్భవించిన పీడీఎస్‌యూ 50 సంవత్సరాలుగా దేశంలో శాస్త్రీయమైన, సమానమైన విద్యావిధానం కోసం నిరంతరం అలుపెరగని పోరాటాలు చేసిందన్నారు.
ప్రస్తుతం దేశంలో బ్రాహ్మణీయ , హిందుత్వ ఫాసిజం రోజురోజుకు పెచ్చురిల్లుతుదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో తమకు అనుకూలమైన పాఠ్యాంశాలను చేర్చి సైన్స్‌ను తొలగిస్తున్నారని ఆరోపించారు. సమానమైన, నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని అన్నారు.
విద్యను వ్యాపార సరుకుగా మారుస్తూ విదేశీ, ప్రైవేటు యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఎం.గణేష్, గుర్రం అజయ్, మర్రి మహేష్, దత్తాత్రి, నితేష్, శ్వేత, శోభిత, పవన్, రమణ, సన్నీ పాల్గొన్నారు.