గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గొప్పగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజు గ్రేటర్‌కు మొండిచేయి చూపింది. హనుమకొండ, వరంగల్ జిల్లాలో అర్బన్ మండలాలను మినహాయించి మిగతా వాటిల్లో ఒక్కో గ్రామంలో ప్రొసీడింగ్స్ అందజే సింది. దీంతో హనుమకొండ, కాజీపేట, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లోని ప్రజలకు నిరాశే ఎదురైంది. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యంతోనే జాబితా సిద్ధం కాలేదని తెలుస్తున్నది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా కోసం నిరుపేదలు ఎదురుచూస్తున్నారు.
– వరంగల్, జనవరి 27
హనుమకొండ జిల్లాలోని 14 మండలాలకు 12, వరంగల్ జిల్లాలోని 13కు 11 మండలాల్లో ప్రొసీడింగ్‌లు పంపిణీ చేశారు. అయితే గ్రేటర్ కార్పొరేషన్లో మండలాలుగా ఉన్న హనుమకొండ, కాజీపేట, వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లో ఒక్క లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వం ప్రకటించిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పెన్షన్లు అందజేయలేదు. హనుమకొండ, వరంగల్ జిల్లాలోని 27 మండలాలకు అర్బన్ పరిధిలోని 4 మండలాలను మినహాయించి మిగతా 23 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి అధికార పార్టీ నాయకులు ఆర్భాటంగా ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అర్బన్ మండలాల్లో మాత్రం అందజేయలేదు. దీంతో సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది.
అర్బన్ మండలాల్లో లబ్ధిదారుల జాబి తా ఇంకా ఖరారు చేయనట్లు సమాచారం. వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఖిలావరంగల్ మండలాలు పూర్తిగా వరంగల్ తూర్పు, పశ్చిమ నియో జకవర్గాల పరిధి లో ఉన్నాయి. తూర్పులో 24 డివిజన్లు, పశ్చిమలో 26 డివిజన్లు ఉంటాయి. ఒక్కో డివిజన్ నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం ఇటీవల నిర్వహించిన వార్డు సభల్లో గ్రేటర్లో ఏకంగా 42,641 దరఖాస్తులు వచ్చాయి. అయితే అర్బన్ ప్రాంతంలో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఎక్కువైందన్న విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు డివిజన్ల వారీగా తమ అనుకూలమైన పేర్లతో ఎమ్మెల్యేలకు జాబితా అందజేసినట్లు సమాచారం. లబ్ధిదారుల జాబితా ఎంపికలో అధికార పార్టీ నాయకుల జోక్యంతో అసలైన నిరుపేదలకు సంక్షేమ పథకాల జాబితాలో చోటు దక్కేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.