హనుమకొండ చౌరస్తా, మే 4: రబీలో లక్షా 30 టన్నుల పంటలు రికార్డుస్థాయిలో పండించామని మంత్రులు చెబుతున్నారని, వారి ముఖం చూసి పంటలు పెరిగాయా.. అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆదివారం హనుమకొండ రాంనగర్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడా రు. దేవాదుల ప్రాజెక్టు లక్ష్యం, విస్తీర్ణం, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తారో తెలువకుండా.. రెండేళ్లలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని బుద్ధి, జ్ఞానం లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని అన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి రబీలో లక్షా 30 టన్నుల పంటలు పండాయనడం బాధాకరమన్నారు. 16 నెలల్లో మీరు ఏం చేస్తే ఉత్పత్తి పెరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.
గత పరిస్థితుల కంటే ఈ యాసంగికి కొత్తగా ఆయకట్టు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ఏ పద్ధతిలో రికార్డు సృష్టించామని చెబుతున్నారు. చిటికెలు, విజిల్స్ వేస్తే పంటలు పండయన్నారు. ఈ సంవత్సరం అవసరమైన నీరు సరఫరా చేశారా.. పంటలు ఎందుకు ఎండిపోయాయన్నారు. దేవాదుల్లో సమ్మక్క-సారక్క జలాశయం నుంచి కిందికి ఎన్ని ఎకరాలకు నీళ్లు పోయాయో తెలుసా.. అవకాశం ఉన్నా గత సంవత్సరం జనవరిలో 24 టీఎంసీల నీళ్లు రబీలో ఎత్తిపోసుకోవడానికి వీలున్నా ఇవ్వలేదు, వృథాగా పోయాయన్నారు.
మూడు ఫేజ్‌ల్లో ఒకటే ఫేజ్ ద్వారా నీళ్లు వాడుతున్నామని, మిగతా పంపులు ఎందుకు స్టార్ట్ చేస్తలేరని ప్రశ్నించారు. దేవాదుల్లో మొత్తం 38 టీఎంసీ నీళ్లు సరఫరా చేసే వ్యవస్థ ఆల్రెడీ సృష్టించబడింది, కానీ ఈ సంవత్సరం నీళ్లు మీరు ఎంత ఇచ్చారు..? 17, 18 టీఎంసీల నీళ్లు కూడా లేవంటే 40 శాతం కెపాసిటీని కూడా వాడలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నారని, మంత్రులు సమీక్ష చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మోటర్లు బంద్ చేసి, వాటిని తీసుకొచ్చి నీళ్లు కావాల్సిన ఎమ్మెల్యే పదివేల ఎకరాల పొలం వద్ద పెట్టార న్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 234 టీఎంసీలు పంపించే అవకాశం ఉంటే 24 టీఎంసీ లు మాత్రమే పంపించారన్నారు.
వర్షాకాలంలో నీళ్లువస్తాయని, మిడ్‌మానేరు, ఎల్ఎండీ నీళ్లతోనే నిండుతా యని అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. 30 బస్తాలకు 50 పండించారని గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు నీళ్లు లేక పంటలు ఎండిపోయాయన్నారు. నాగార్జున సా గర్ నుంచి ఆంధ్రకు నీళ్లను తరలిస్తే, ఉన్న వాటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన మంత్రులు ఉన్నారన్నారు.
ముఖ్యమంత్రి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు నెలరోజుల్లో రూ.1890 కోట్లు, మరో నెల రోజుల్లో రూ. 4వేల కోట్లు, ఇప్పుడు రూ. 6,900 కోట్లు అంటున్నాడని, అసలు డీపీఆర్ లేకుండా టెం డర్లు ఇచ్చారని హరీశ్‌రావు అన్నారని గుర్తు చేశారు. సిగ్గు ఉండాలని, రూ. 7 వేల కోట్లతో నీ నియోజకవర్గంలో చేస్తున్నానని చెప్పుకోవడానికేనా అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ నీళ్లు జూరాల నుం చి పైస్థాయిలో ఉన్న ఆయకట్టకు ఇవ్వకుండా దోచుకొచ్చి ఇస్తానని చెప్పుకుంటున్నావని, నీ కేబినెట్లో ఉన్నవారు, అక్కడి వారు ఆబ్జెక్షన్ చెప్పలేదా.. అని మేం ప్రశ్నిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టారని తెలివి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.