హనుమకొండ, జూలై 21 : కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఎల్‌నినో ప్రభావంపై హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే హాజరుకాకపోవడంపై విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకుగాను ప్రత్యామ్నాయ మార్గా లు, ముందస్తు ప్రణాళికలు రూపొందించడంపై చర్చించే సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, దేవాదుల ప్రాజెక్టు, కాంటిజెన్సీ ప్రణాళికల అమలుపై సుదీర్ఘంగా జరిగిన సమావేశం మొక్కుబడిగా సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమతమ నియోజకవర్గాల్లోని పరిస్థితులను ఇన్చార్జి మంత్రి దృష్టి తీసుకొచ్చారు. పది పంపులకు గాను ఇప్పటి వరకు ఎనిమిది ప్రారంభించామని దేవాదుల ప్రాజెక్టు అధికారులు తెలుపగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏడు పం పులు మాత్రమే ప్రారంభించారని వారిపై అసహనం వ్యక్తం చేశారు. అలా గే వివిధ శాఖలకు చెందిన అధికారులు నివేదికలను చదువుతున్న క్రమం లో కూడా ఇన్చార్జి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
రిపోర్టు గణాంకాలు కాకుండా క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు తెలియజేయాలని సూచించినట్లు సమాచారం. అనంతరం పొంగులేటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నా రు. వర్షాభావ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి దేవసేనను నియమించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా వ్యవసా యం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక అధికారుల ద్వారా నివేదికలు సిద్ధం చేసి త్వరలో క్యాబినెట్ సమావేశంలో ఆమోదించి కేంద్రానికి పంపించి సహాయం కోరనున్నట్లు వెల్లడించారు.
వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేసే పంటలపై క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే కోతుల బెడద నివారణకు సూచనలు ఇవ్వాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు మోటర్లు ప్రతి రోజు పూర్తిస్థాయిలో నడిచేలా చర్యలు తీసుకోవాలని, లోపం తలెత్తితే 24గంటల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాక ర్ మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలన్నారు.
ముఖ్యంగా లెమన్ గ్రాస్ వంటి ఆదాయం అందించే పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థి క సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి దేవసేన, హనుమకొండ, ఆరు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో రైతాంగం పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో నిర్వహించిన సమా వేశానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి హాజరుకాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమతమ నియోజకవర్గాల్లో కరువు పరిస్థితులను ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకరాగా మంత్రులు, ఎమ్మెల్యే సెగ్మెంట్లలో ఆ అవ కాశం లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.