జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి దుమ్ముంటే నేరుగా తమ కళాశాలకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తే తమ చదువు సత్తా ఏంటో చూపిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ఖులు సవాల్ విసిరారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
నిరసన దీక్షలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ… పాలిటెక్నిక్ విద్యార్థులను క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవారిగా సీఎం రేవంత్‌రెడ్డి చిత్రీకరించడం సరికాదని మండిపడ్డారు. ఫాం కూడా నింపలేరంటూ తమపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే తమ వద్దకు వచ్చి పరీక్ష పెట్టాలని సవాల్ చేశారు. డిప్లొమా పూర్తిచేసిన తర్వాత ఈ సెట్ ద్వారా నేరుగా బీటెక్‌లో చేరే అవకాశాన్ని తొలగించొద్దని డిమాండ్ చేశారు.
తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే నిరసన చేపట్టామన్నారు. ఇప్పటికే కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా స్పందన రాలేదన్నారు. కాగా, వీరి ఆందోళనకు ఏఐఎస్ఏ, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ తదితర విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆయా సంఘాల నాయకులు, ప్రతినిధులు విద్యార్థులతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకోగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.