వరంగల్‌చౌరస్తా, ఫిబ్రవరి 26 : జిల్లాలో ఆదివారం నిర్వహించనునన పల్స్ పోలియోను విజయవంతం చేయాలని పలువురు వైద్యాధికారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లలు సుమారు 70,931మంది ఉన్నారు. 440 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం 2576 మంది సిబ్బంది పనిచేయనున్నారు. మొదటి రోజు కేంద్రాల్లో, తర్వాత రెండు రోజు లు ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేస్తారన్నారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా చుక్కల మందు వేయొచ్చన్నారు.
పోచమ్మమైదాన్‌లో..
పోచమ్మమైదాన్: చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్ అన్నారు. అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సూపర్వైజర్ జన్ను కోర్నెలు, అనిల్‌కుమార్, నర్సులు సరస్వతి, జ్యోతి, ఏఎన్ఎంలు జ్యోతి, శోభ, అమృత, సుల్తాన, అశ్విని, నిహారిక, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నెక్కొండలో ..
నెక్కొండ: పల్స్ పోలియోను విజయవంతం చేయాలని కోరుతూ వైద్యసిబ్బంది, విద్యార్థులు పీహెచ్సీ వైద్యాధికారి రమేశ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట: మండల కేంద్రంలో నిర్వహించే పల్స్‌పోలియోను విజయవంతం చేయాలని ఇన్చార్జి వైద్యాధికారి శ్రీదేవి పిలుపునిచ్చారు. ఈ మేరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో వెంకటేశ్వరరావు, కేజీబీవీ పాఠశాల స్పెషలాఫీసర్ ఎం జ్యోతి, వైద్య సిబ్బంది అరుణ, సుమ, ఉపాధ్యాయులు సబిత, తేజస్విని, సంధ్య, విద్యార్థినులు పాల్గొన్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి : పల్స్ పోలియోను విజయవంతం చేయాలని వైద్యాధికారి మహేందర్‌నాయక్ అన్నారు. మేడెపల్లి, నల్లబెల్లి పీహెచ్‌సీల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పల్స్‌పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ మహేందర్ నాయక్ మాట్లాడుతూ పల్స్ పోలియోను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మేడెపల్లి వైధ్యాధికారి శశికుమార్, దామోదర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం : పోలియో చుక్కల పంపిణీని వినియోగించుకోవాలని కోరుతూ వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి పొగాకుల అశోక్ మాట్లాడుతూ.. మండలంలో 33 గ్రామపంచాయతీల పరిధిలోని 3512 మంది పిల్లలకు పోలి యో చుక్కలు వేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా మొండ్రాయిలో ఏఎన్ఎం నిర్మలాజ్యోతి ప్రచారం చేపట్టారు.