నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీపీ అంబర్ కిశోర్ ఝా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, ఇతర పోలీసు అధికారులు, అమరవీరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఓఎస్డీ బోనాల కిషన్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తదితరులు నివాళులర్పించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తదితరులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ములుగు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ పీ శబరీష్, అదనపు ఎస్పీ సదానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.