దుగ్గొండి, మార్చి,15 : కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరకు వివిధ పార్టీల ప్రభ బండ్ల తరలింపు సందర్భంగా శనివారం వరంగల్-నర్సంపేట రహదారి గిర్నిబావి సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జాతరకు యేటా బీఆర్ఎస్, కాంగ్రె స్, సీపీఎం, బీజేపీ ఆధ్వర్యంలో ప్రభ బండ్లతో తరలివెళ్లడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో గత వారం రోజులుగా నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించి చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు అధికార పార్టీకి చెందిన ప్రభలనే ముందుగా తరలిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రభలను నిలిపివేశారు. తొగర్రాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ ప్రభ బండి ముందుకు రాగా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమ యంలో ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగారు.
దీంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యం లో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై విచక్షణారహితం గా లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో గిర్నిబావికి చెందిన కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, యార శ్రీనివాస్, సద్ది నరసింహారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల లాఠీచార్జి విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చారు. పోలీసుల ఓవరాక్షన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అకారణంగా ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో పోలీసులు లాఠీచార్జి చేశారని, కావాలనే తమ కార్యకర్తలపై దాడి చేశారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై వాటాలు పంచుకొని నర్సంపేటలో ప్రతిపక్ష కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇతర పార్టీల కార్యకర్తలపై దాడుల సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నదని, రాబోయే రోజుల్లో దాడులకు ప్రతి దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు.
-మాజీ ఎమ్మెల్యే పెద్ది