మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 1 : సెలవులకు ఇంటికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు అతడిని వెంబడిస్తూ వచ్చి గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన మానుకోట శివారు అయోధ్య గ్రామ పంచాయతీ పరిధి భజన తండా వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన తాటి పార్థసారథి (40)కి గత ఏడాది దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది.
అప్పటి నుంచి దంతాలపల్లిలోనే కిరాయి ఇంట్లో ఒక్కడే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యా పిల్లలు చర్లలో ఉంటుండగా, రెండు రోజులు పండుగ సెలవులు రావడంతో ఇంటికి వెళ్లాడు. తిరిగి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని వెంబడిస్తూ వచ్చి భజన తండా వద్ద గొడ్డలితో తలపై నరికి హత్య చేసి రోడ్డు పక్కనున్న మిర్చి తోటలో పడేశారు. విషయం తెలిసిన మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుడి ద్విచక్ర వాహనం, తలపై గాయాలను ఎస్పీ పరిశీలించారు.
డాగ్ స్కాడ్, క్లూస్ టీంను రప్పించి డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో సీఐలు సర్వయ్య, రవికుమార్, ఎస్సైలు దీపికారెడ్డి, మురళీధర్, సతీశ్ విచారణ ప్రారంభించారు. మృతుడి కాల్ డేటాను పరిశీలిస్తున్నామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా, తన తమ్ముడి మృతిపై అనుమానాలున్నాయని అతడి అక్క హేమ ఆరోపించారు. పాఠశాల సిబ్బంది ద్వారా హత్యకు గురైన విషయం తెలుసుకున్న ఆమె ఘటనా స్థలికి చేరుకొని భోరున విలపించింది. గతంలో భద్రాచలంలో ఉన్న సమయంలో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగగా కొంతమంది దాడి చేసేందుకు వెంబడించారని, మళ్లీ ఇప్పుడు హత్య చేశారని అన్నారు. తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, నిందితులను అరెస్ట్ చేసి తన తమ్ముడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.