జనగామ, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : శ్రమపడకుండా ఈజీ మనీకి అలవాటు పడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22.57లక్షల విలువైన నగలు, స్కోడా కారు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ శనివారం విలేకరులకు వెల్లడించారు. హనుమకొండ రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన హోటల్ వ్యాపారం చేసే బంగారి నరేశ్ కుమార్ (33), టైలరింగ్ పనిచేసే వరంగల్ ఎల్బీనగర్ ఏనుమాముల మార్కెట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆసీఫ్ పాషా(35)ను జనగామ-హనుమకొండ హైవేపై యశ్వంతపూర్ ఎల్లమ్మ గుడి వద్ద అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుంచి రూ.17.50 లక్షల విలువైన 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.27లక్షల విలువైన వెండి ఆభరణాలు, రూ.3.79 లక్షల నగదు, స్కోడా కారును స్వాధీనం చేసుకున్నట్లు రాజమహేంద్రనాయక్ తెలిపారు. గోవాలో హోటల్ వ్యాపారం చేసి నష్టపోయిన నరేశ్‌కుమార్ కొడుకు ఆపరేషన్ కోసం చాలా డబ్బు ఖర్చు కావడంతో వరంగల్‌కు మకాం మార్చగా ఏనుమాముల మార్కెట్ వద్ద ఆసీఫ్షాపా పరిచయమయ్యాడు. ఇద్దరు చేస్తున్న వృత్తుల వల్ల వస్తున్న డబ్బు సరిపోక సులభంగా సంపాదించాలని దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారని డీసీపీ వివిరించారు. జనగామ, నర్సంపేట, కేయూసీ, భూపాలపల్లి, తొర్రూరు, సుబేదారి, వర్ధన్నపేట పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి, పట్టపగలు ఇంట్లో ఎవరూలేని తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
జనగామ పట్టణంలోని హనుమకొండ రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా చోరీ కోసం పథకం రూపొందించి కారులో వస్తున్న వీరు పోలీసులను చూసి యూటర్న్ తీసుకొని పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ రాజమహేంద్రనాయక్ వివరించారు. దొంగలను గుర్తించి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అర్భన్ సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సైలు భరత్, చెన్నకేశవులు, సీసీఎస్ సీఐ, సిబ్బంది, ఏఎస్ఐ శంకర్, కానిస్టేబుళ్లు టీ రామన్న, రామకృష్ణ, కే అనిల్‌కుమార్, సురేశ్‌కుమార్, ఏఏవో సల్మాన్పాషాను వరంగల్ కమిషనర్ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ పార్ధసారధి, సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సైలు భరత్, చెన్నకేశవులు పాల్గొన్నారు.