పాలకుర్తి, మే 5 : దళితుల హక్కులు, అణచివేతలపై మాట్లాడే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సాక్షిగానే దళితుడికి అవమానం జరిగినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తిలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంస్థాగత నిర్మాణ సన్నాహక విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, ఇన్చార్జి లింగం యాదవ్, డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జెన్నారెడ్డి, భరత్ చందర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశానికి దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన మాజీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి అనుచరులతో పాటు పాలకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఉప్పల సాయిప్రకాశ్ వచ్చాడు. వీరిని పోలీసులు, కాంగ్రెస్ నాయకులు గేట్ ముందే ఆపి వెనక్కి పంపించేశారు. ఈ ఘటనపై పెద్ది అనుచరులు, సాయిప్రకాశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పార్టీ సమావేశానికి దళిత నాయకుడు అద్దంకి దయాకర్ వచ్చినా దళిత బిడ్డనైన తనను ఎందుకు పంపరని సాయిప్రకాశ్ గొడవకు దిగాడు. పార్టీ సభలో పోలీసుల అత్యుత్సాహం ఏమిటని ప్రశ్నించాడు. కాంగ్రెస్‌లో దళితులు, బీసీలకు స్థానం లేదని పలువురు వాపోయారు. పాలకుర్తి కాంగ్రెస్ మొత్తం రెడ్డి, వెలమ కాంగ్రెస్‌గా మారిందని ఎద్దేవా చేశారు. పాలకుర్తి కాంగ్రెస్‌లో మాజీ మంత్రి దయాకర్‌రావు కోవర్టులది అనుచరులదే నడుస్తోందన్నారు.
అలాగే దేవరుప్పుల మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, టీ పీసీసీ సభ్యుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి భర్త డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్‌కు సమావేశంలో తీవ్ర అవమానం జరిగింది. పాలకుర్తి నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా టీ పీసీసీ సభ్యుడిగా లక్ష్మీనారాయణ నాయక్ కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషిచేశాడు. అలాంటి వ్యక్తిని సైతం స్టేజీ పైకి పిలువకపోవడంతో ఆయన సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. ఏదేమైనా నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. కాంగ్రెస్ సభకు పోలీసుల పహారా అంటూ పలువురు చర్చించుకున్నారు.