స్ట్టేషన్ఘన్పూర్, ఫిబ్రవరి 8: దేశంలోని అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతున్నదని స్థానిక సంస్థల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతును కోల్పోయిందని, ఎవరొచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పడం లేదన్నారు.
రాహుల్‌గాంధీ బీజేపీకి బీ టీం అని, ఇతర పార్టీల ఓట్లను చీల్చి బీజేపీ విజయానికి పరోక్షంగా ఆ పార్టీ కృషి చేస్తున్నదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుంటే ప్రజాగ్రహం తప్పదన్నారు. కుల గణన పేరుతో బీసీల మోసం చేసిన సీఎం, ఎస్సీ వర్గీకరణ విషయంలో నాన్చుడు ధోరణి తప్పా.., వర్గీకరణ చేసేది ఎప్పుడో స్పష్టం చెప్పడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ అంటూ మాల, మాదిగలను రెచ్చగొడుతూ వారి మధ్య చిచ్చుపెడుతున్నాడని అన్నారు.
వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ లక్ష డప్పులు, వేల గొంతుల పేరుతో పెద్ద కార్యక్రమం చేపడుతున్నాడని, దీనికి బీఆర్ఎస్, ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయనే ఉద్దేశంతోనే వర్గీకరణ చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరితంగానే కేసీఆర్ కుటుంబంపై అనేక అక్రమ కేసు లు పెడుతున్నాడని, అందులో ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు కూడా నిలువలేదన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తున్నదని, ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడరన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోల్పోయారని, రాక్షస పాలన నడుస్తున్నదని పోచంపల్లి అన్నారు. ఇవే తన చివరి ఎన్నికలని కేసీఆర్‌ను వేడుకొని బీఆర్ఎస్తో గెలిచి, తన కూతురు కోసం అతడి అనుభవాన్ని, ఆత్మాభిమానాన్ని కాంగ్రెస్‌కు కడియం శ్రీహరి తాకట్టు పెట్టారన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదని, వయసులో చిన్నవాడైన కేటీఆర్ విజన్ ఉన్న వ్యక్తి అని, అతడి కింద పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పిన కడియం, నేడు కాంగ్రెస్ మెప్పు కోసం కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న వ్యక్తి వద్ద పనిచేసే వారిని ఏమంటారో కడియం చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించి వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం సరికాదన్నారు. మరికొద్ది రోజుల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు వస్తాయని, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే రాజయ్యను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడానికి నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్‌రెడ్డి తన కేఎంఆర్ చానల్లో కడియానికి వ్యతిరేకంగా వార్తలు పెట్టినందుకు అతడిపై కక్షపూరితంగా కేసులు పెట్టించి, జైలుకు పంపించాడని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. 14 నెలల పాలనలో కడియం ఇప్పటి వరకు ఏడుగురిపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. మనోజ్‌రెడ్డిని జైలు నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్ పాల్గొన్నారు.