– రుద్రంపూర్ డిస్పెన్సరీలో ఆధునిక ఫిజియోథెరపీ యూనిట్ ప్రారంభం
రుద్రంపూర్, మార్చి 18 : ఉద్యోగుల ఆరోగ్యం సంస్థకు అత్యంత ప్రాధాన్యమని, వారి సంక్షేమానికి సింగరేణి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ డిస్పెన్సరీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక ఫిజియోథెరపీ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రుద్రంపూర్ డిస్పెన్సరీలో ఫిజియోథెరపీ యూనిట్ ఏర్పాటు చేయడం ఎంతో సమయోచిత నిర్ణయం అన్నారు. ఈ యూనిట్ ద్వారా సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే స్థానిక కాంట్రాక్ట్ కార్మికులు సులభంగా వైద్య సేవలు పొందవచ్చన్నారు. అలాగే భవిష్యత్‌లో ఈ యూనిట్‌ను మరింత ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి పరచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ యూనిట్‌ను ఉద్యోగులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ, రుద్రంపూర్ డిస్పెన్సరీని మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. దీని ద్వారా మెయిన్ హాస్పిటల్ వరకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, సమయం, ప్రయాణ భారాన్ని ఉద్యోగులు తగ్గించుకోగలరని తెలిపారు.
అనంతరం ఆయన వి.కె కోల్ మైన్స్‌ను సందర్శించారు. వ్యూ పాయింట్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రాంతాలను పరిశీలించారు. సురక్షితంగా బొగ్గు ఉత్పత్తి నిర్వహణకు అవసరమైన సూచనలు అధికారులకు చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్‌కుమార్, డాక్టర్ పరశురాం, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వి.మల్లికార్జున రావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎం.వి.నరసింహారావు, ఏజీఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యానికి కొత్త అడుగు