చేగుంట, జూలై 14: బ్యాంకులో డబ్బులు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న ఓ రైతును వెంబడించిన ఇద్దరు దుండగలు అతడిని బెదిరించి రూ.25 వేలు ఎత్తుకెళ్లారు. చేగుంట మండలం మక్కరాజిపేట రోడ్డులోని కర్నాల్‌పల్లి సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వడ్ల పైసలు తీసుకొని బండిపై వస్తుంటే.. ఇద్దరు దొంగలు తనను ఏమార్చి.. నగదుతో ఉడాయించారని బాధితుడు మక్కరాజిపేట గ్రామానికి చెందిన బోయిని చంద్రయ్య పోలీసులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు.
మక్కరాజిపేట గ్రామానికి చెందిన బోయిని చంద్రయ్య తన వడ్లకు సంబంధించిన డబ్బుల కోసం మంగళవారం చేగుంట గ్రామీణ వికాస్ బ్యాంకుకు వెళ్లాడు. తన ఖాతా నుంచి రూ. 25వేలు డ్రా చేసుకొని తిరిగి తన టీవీఎస్ ఎక్స్ఎల్ మీద ఇంటికి వస్తున్న క్రమంలో ఆయన.. కర్నాల్‌పల్లి ఎల్లమ్మ సమీపంలోని ఓ దుకాణం వద్ద బ్రేడ్ ప్యాకెట్ కొన్నాడు. చంద్రయ్య తన ఊరు మక్కరాజిపేటకు సమీపంలో ఉండగా.. రోడ్డు వెంబడి ఎవరూ లేనిది చూసి.. గొందివారి కుంటపై రెండు బైకులపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయను వెంబడించారు. వారు తలా రూ.70 నగదును చంద్రయ్య ముందు పడేసి.. నీ డబ్బులు పడిపోయాయని చెప్పి మాటల్లో పెట్టారు.
ఏం జరుగుతుందో గ్రహించేలోపే చంద్రయ్య దిచక్రవాహనాన్ని కింద పడేసిన దుండగులు.. అతడి దగ్గరున్ను రూ. 25వేల నగదు, బ్యాంకు పాస్ బుక్కు, విద్యుత్ కనెక్షన్ కోసం తీసుకున్న డీడీలకు సంబంధించిన పేపర్లు ఎత్తుకెళ్లారు. తన డబ్బుల చోరీ గురించి చంద్రయ్య ఇట్టి చేగుంట పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్న పోలీసులు సీసీ పూటేజీని పరిశీలించి, విచారణ చేపడుతున్నారు.