దౌల్తాబాద్/ రాయపోల్ జూలై 14: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. నియోజకవర్గంపై జిల్లా యంత్రాంగం చిన్నచూపు చూస్తోందని పేర్కొన్న ఆయన ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సర్పంచులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమీక్షా సమావేశం సందర్భంగా మండలంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా వ్యవసాయ, సాగునీటి శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. యూరియా, ఎరువులు, విత్తనాలు తదితర వ్యవసాయ అవసరాల్లో కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, సబ్సిడీ పథకాలు, హార్టికల్చర్, పౌల్ట్రీ, ఫిష్ పాండ్స్ వంటి రంగాల్లో లభించే ప్రోత్సాహకాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన అధికారులను కోరారు.
విద్యుత్ శాఖ అధికారులతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా, స్తంభాల అవసరం, నిర్వహణపై సమీక్షించిన ఎమ్మెల్యే.. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా అందించాలని అన్నారు. దౌల్తాబాద్ మండలానికి రెగ్యులర్ ఏఈని త్వరగానియమించాలని ఎస్ఈకి ప్రభాకర్ రెడ్డి సూచించారు. వైద్య శాఖ పనితీరు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని.. ముఖ్యంగా పాముకాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు ఆయన సూచనలు చేశారు.

దుబ్బాక నియోజకవర్గంలోని రైతులకు మల్లన్నసాగర్ జీవనాధారమని, కాలువల ద్వారా పూర్తిస్థాయిలో నీరు అందకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు వర్షాకాల వరి నాట్లు వేసుకుని ఎదురుచూస్తున్నారని చెప్పిన ప్రభాకర్ రెడ్డి.. సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దుబ్బాక మీద జిల్లా కలెక్టర్‌కు చిన్న చూపు ఉందని, జిల్లా అధికారులను సమీక్ష సమావేశానికి పంపాలని కోరినా పంపలేదని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు, గృహ నిర్మాణాలపై కూడా సమీక్షించి, ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.
గ్రామపంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులు, అన్ని శాఖల అధికారులు గ్రామ సర్పంచ్‌లతో సమన్వయంగా పనిచేసి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
దౌల్తాబాద్ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి రోడ్లు, కాలువల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన లభించడం లేదని ప్రభాకర్ రెడ్డి వాపోయారు.