SC Hostel | జనగామ చౌరస్తా, మార్చి 24 : నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం స్థాపించిన ఎస్సీ వసతి గృహాలు పేకాట క్లబ్లుగా రూపాంతరం చెందుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. దళిత విద్యార్థులకు శాపంగా మారింది. వసతి గృహంలో ఉంటూ శ్రద్ధగా చదువుకోవాల్సిన ఆరుగురు విద్యార్థులు పట్టపగలే పేకాట ఆడుతూ పెద్దలకు కనిపించడంతో మీడియాకు సమాచారం అందించారు. సమాజాన్ని విస్తుకల్పించే ఈ సంఘటన ఎక్కడో మారుమూల ఆదివాసి, గిరిజన గూడాల్లో జరిగింది కాదు. జనగామ జిల్లా కేంద్రం నడిబొడ్డులో గల ధర్మకంచ ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో సోమవారం మధ్యాహ్నాం వెలుగు చూసింది.
9వ తరగతికి చెందిన సీనియర్ విద్యార్థులతో పాటు పలువురు జూనియర్ విద్యార్థులు కలిసి పేకాట ఆడడం జరిగింది. ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరని తెలిసింది. పిల్లల్ని ఇంటి దగ్గర చదివించడానికి ఆర్థిక స్తోమత లేని నిరుపేద తల్లిదండ్రులు గంపెడాశతో వారి పిల్లలను ఊరికి దూరంగా ఉన్న ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంచి చదివిస్తుంటారు. వసతి గృహాల్లో ఉన్న పిల్లలు సక్రమంగా చదువుకుంటారన్న నమ్మకం అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల తల్లిదండ్రులకు లేకుండా పోతుంది. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు జూదరులుగా మారడానికి కారకులను గుర్తించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.