జనగామ, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ‘జీవకోటికి ప్రాణవాయువునిచ్చే చెట్టు పుట్టుక నుంచి చావుదాకా కల్పతరువై నిలుస్తుంది.. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది..సకాలంలో వానలు కురిపించి కరువు కాటకాలు లేకుండా చేస్తుంది.. సమస్త మానవాళికి మనుగడనిస్తుంది’.. కానీ రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పచ్చదనాన్ని పట్టించుకోలేదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణను ప్రజాప్రతినిధులు విస్మరించారు.
అధికారులు గాలికి వదిలేశారు. కనీసం నీళ్లు పోసి వాటి అలనాపాలనా చూసే నాథుడే లేకుండా పోయాడు. ఫలితంగా వేలాది హరితహారం మొక్కలు ఎండిపోయాయి. పచ్చదనం మటుమాయమైంది. నాడు పచ్చదనంతో కళకళలాడిన పల్లెలు నేడు కళావిహీనంగా మారాయి. ఈ ఏడాది జూన్ 18న సీఎం రేవంత్రెడ్డి వన మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి నెల రోజులు దాటినా ఉమ్మడి జిల్లాలో ఒక్క మొక్క నాటలేదు. ఒక్క ములుగు జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో సరైన వర్షాలు పడక మొక్కలు నాటలేదని అధికారులు చెబుతుండగా, ఉపాధిహామీ కింద గ్రామాల్లోని నర్సరీల్లో ఎక్కడి మొక్కలు అక్కడే నిలిచిపోయాయి.
గతంలో ఆటవీశాఖ ద్వారా కూడా పెద్దఎత్తున మొక్కలు పెంచి ప్రజలకు ఉచితంగా పంచేవారు..కానీ రెండేళ్లుగా ఆటవీశాఖ నర్సరీల పెంపకానికి బడ్జెట్ కేటాయించకపోవడంతో అది ఆగిపోయింది. వన మహోత్సవంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోటీ 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి వరకు 8.50 లక్షలు మాత్రమే నాటడం..అనుకూల సమయాలైన జూన్, జూలై నెలలు సైతం గడిచిపోవడంతో లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది.
మొక్కలు నాడటంలో ప్రభుత్వం 13 శాఖలను భాగస్వాములను చేసింది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 43.51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఉంటే.. ఇప్పటి వరకు లక్ష (12.39శాతం) మాత్రమే నాటారు. ములుగు జిల్లాలో 12.30 లక్షలకు 71వేలు(27శాతం), భూపాలపల్లి జిల్లాలో 25.26 లక్షలకు 1.29 లక్షలు(22.25శాతం), హనుమకొండ జిల్లాలో 18.17 లక్షలకు 1.57 లక్షలు (15.26 శాతం), వరంగల్ జిల్లాలో 25.51లక్షలకు 1.99 లక్షలు (9.21శాతం) నాటితే జనగామ జిల్లాలో మాత్రం 25.92 లక్షలకు కేవలం 1.64లక్షలు (6.42శాతం) మొక్కలు నాటారు.
కేసీఆర్ ముందుచూపుతో..
పర్యావరణ పరిరక్షణ కోసం పల్లెలు.. పట్నాల్లో మహత్తర యజ్ఞంలా తెలంగాణకు హరితహారం గ్రీన్ఫండ్ (నిధి)ని కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందించారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లెలన్నీ హరితవనాలుగా మారి అడవుల శాతాన్ని గణ నీయంగా పెంచింది. పదమూడేండ్ల కిందట ఎడారిని తలపించేలా ఉన్న జనగామ జిల్లాలో తెలం గాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం కొత్తపుంతలు తొక్కింది. ఏకకాలంలో ఒకే రోజు కోటి విత్తన బంతులు (సీడ్ బాల్స్) తయారీ చేసి 2017 జూలై 24న అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 1 శాతం ఆటవీ సంపద కారణంగానే ఎగువ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదై జిల్లాలో ప్రతి ఏటా దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మహోద్యమంలా మొక్కల పెంపకానికి అప్పట్లో శ్రీకారం చుట్టింది.