హనుమకొండ, డిసెంబర్ 1 : పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది.. ఇప్పటికే తొలి విడత నామినేషన్లు పూర్తికాగా, వాటి పరిశీలన కూడా ముగిసింది. రెండో విడత నామినేషన్ల సమర్పణ కొనసాగుతున్నది. అయితే పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తుల గుబులు పట్టుకున్నది. ఎన్నికల సంఘం సర్పంచ్‌లకు 30, వార్డు సభ్యులకు 20 రకాల సింబల్స్ ప్రకటించగా.. కొన్ని ఒకే మాదిరిగా ఉండడం వారిలో ఆందోళనను రేకెత్తిస్తున్నది. తమ మద్దతుదారులు, వృద్ధులు ఒక గుర్తనుకొని మరో దానిపై ఓటు వేస్తే తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందోనన్న బెంగ వారికి పట్టుకున్నది. తమకు కేటాయించిన గుర్తును ఓటర్లు గుర్తుపెట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు అభ్యర్థులకు గుబులు పుటిస్తున్నాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల్లో కేటాయించే గుర్తులపై ఆందోళన చెందుతున్నారు. కొన్ని గుర్తులు ఓకే పోలికతో ఉండటంతో అయోమయంగా ఉందని, అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న వారికి ఎన్నికల అధికారులు కేటాయించే గుర్తులు ఒకే పోలికతో ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆల్ఫాబెటికల్గా కేటాయించే గుర్తులను ఓటర్లు గుర్తుంచుకోవడం చాలా కష్టతరంగా ఉంటుందని పల్లెల్లో చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికలు కావడం, అలాగే బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల ఫొటో, పేరు లేకుండా కేటాయించిన గుర్తులు మాత్రమే ముద్రించనున్న నేపథ్యంలో వృద్ధులు, నిరక్ష్యరాస్యులు గుర్తించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోటా పోటీగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఏదో ఒక గుర్తుపై ఓటు వేస్తే సర్పంచ్, వార్డు మెంబర్ కావాలనుకొనే తమ ఆశలు నెరవేరక భవితవ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పింక్, వార్డు సభ్యులకు తెల్ల బ్యాలెట్ పేపర్‌ను వినియోగించనున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు 30 రకాల గుర్తులను కేటాయించనున్నారు. వీటిలో ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్స్, టీవీ, రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హాండిల్, టీ జల్లెడ(చాయ వడపోసే జాలి), చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మెన్, పడవ, బిసెట్, వేణువు, చైన్, చెప్పులు, గాలిబుడగ, స్టంప్స్ వంటివి ఉన్నాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు తొలుత 20 రకాల గుర్తులను కేటాయించి, తర్వాత అందులో నుంచి గాజు గ్లాస్‌ను తీసివేశారు. వీటిలో గౌను, గ్యాస్ స్టౌ, స్టూల్, సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటినా, గరాట, మూకుడు, ఐస్‌క్రీమ్, పోస్టు డబ్బా, కవర్, హాకీ, బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కటెల్
గుర్తులున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల అధికారులు కేటాయించిన గుర్తుల్లో కొన్ని ఒకే పోలికతో ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరనం నెలకొన్నది. దీంతో ఓటర్లు గందరగోళానికి గురవుతారని, గుర్తుపట్టడం ఇబ్బంది పడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు అభ్యర్థుల్లో గుబులు పట్టుకున్నది. ముఖ్యంగా బ్యాట్, టీవీ రిమోట్, పలక, బ్లాక్ బోర్టు, బిస్కెట్, మంచం వంటి గుర్తులు దాదాపు ఒకేలా ఉండడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతారని, అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అలాగే దువ్వెన, అరటిపండు కూడా ఒకేలా ఉండడంతో పాటు గ్యాస్, సిలిండర్ వేర్వేరుగా ఇవ్వడం ఇబ్బందికరంగా ఉంటుందని, ఇలాంటి గుర్తులతో తమకు ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. ప్రచారంలో ఓటర్లు గుర్తుంచుకొనేలా గుర్తులు చెప్పడం కత్తిమీది సాములాగా మారిందనే చర్చ గ్రామాల్లో జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఎంతో ఆశతో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యం తారుమారు అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయలు వ్యక్తమవడం కొసమెరుపు.