జనగామ, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం.. విచారణను అక్టోరర్ 8కి వాయిదా వేయడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత చోటుచేసుకుంది. అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొన్నది. ప్రస్తుతం ఖరారైన స్థానాల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న వారికి రిజర్వేషన్లు చెల్లుబాటవుతాయా? హైకోర్టు ప్రక్రియ మొతాన్ని రద్దు చేస్తుందా? అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చి అధిష్టానం ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్న గ్రామాల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ ఆశావహులకు ఇప్పటికే దసరా దావత్ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. మరికొందరు మాత్రం కోర్టు తీర్పు వచ్చే వరకు వేచిచూసే ధోరణిలో ఉన్నా రు. స్థానిక ఎన్నికలపై కొన్నాళ్లుగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన మండల, గ్రామస్థాయి నాయకులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు.
ఏదో ఒక పదవికి పోటీ పడొచ్చని స్థానికంగా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ, వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందిస్తూ జేబులు ఖాళీ చేసుకున్నారు. ఎవరూ ఊహించనిరీతిలో వెలువడిన రిజర్వేషన్లతో ఎన్నికలకు సిద్ధపడి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకున్న నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారితే.. కొత్త రిజర్వేషన్ల వల్ల అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో అనేక లోపాలున్నాయని, అశాస్త్రీయంగా, అసంబద్ధంగా చేపట్టిన ఈ ప్రక్రియలో అన్యాయం జరిగిందని ఇప్పటికే పలువురు కోర్టును ఆశ్రయించారు. ఎస్టీలు ఎక్కువున్న గ్రామాల్లో జనరల్‌కు, అసలు ఎస్సీలే లేని ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గానికి, తల్లి, కుమారుడు ఇద్దరే ఉన్న ఓ గ్రామంలో సర్పంచ్, వార్డు స్థానం ఎస్సీలకు రిజర్వు అయిన తీరుపై ఆయా గ్రామాల్ల్లో గందరగోళం నెలకొన్నది.
హైకోర్టు తీర్పుపైనే ఫోకస్..
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ విషయంలో దాఖలైన పిటిషన్‌పై ఈనెల 8న హైకోర్టు విచారించనుండగా, ఎలాంటి తీర్పు వెలువడుతుందోననే ఉతంఠ అందరిలో నెలకొన్నది. పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక అభ్యంతరం చెపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం విడుదల చేసిన షెడ్యూల్‌ను రద్దు చేసి, కొత్తది ప్రకటించక తప్పదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతంలోపు ఉండాలని గుర్తుచేస్తూ జీవోను హైకోర్టు కొట్టివేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
జీవో కొట్టేస్తే కథ మళ్లీ మొదటికి..
పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే ప్రభుత్వం వెంటనే మొత్తం రిజర్వేషన్లు 50 శాతంలోపు కేటాయించి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. బీసీ రిజర్వేషన్లను కుదించేందుకు కొత్తగా జీవో జారీచేసి దాని ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలంటే మరికొంత సమయం పడుతుంది.
అది పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కొత్త షెడ్యూలు విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే ప్రకటించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు తారుమారై మరోసారి కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేస్తుంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీసీలకు 23 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు.