వర్షాకాలం వస్తుందంటే చాలు శివనగర్ ప్రజల గుండెల్లో గుబులు పుట్టేది. నెలల తరబడి వరద నీటిలోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఉండేది. కోట అగడ్త ఉధృతికి పలు కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చేది. శివనగర్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంత వాసులు ధర్నాలు, రాస్తారోకోలు చేసి అప్పటి ప్రజా ప్రతినిధులను కలిసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముంపు సమస్య తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, రూ.42 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణ పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి.
– ఖిలావరంగల్, ఫిబ్రవరి 3
ఖిలావరంగల్, ఫిబ్రవరి 3 : శివనగర్ ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వానకాలంలో వరద నీటితో 60 ఏళ్లకు పైగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు పూనుకున్నది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముంపు సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి కేటీఆర్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన తర్వాత సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 42 కోట్ల నిధులను మంజూరు చేయించారు.
శరవేగంగా పనులు..
శివనగర్ను శాశ్వతంగా ముంపు నుంచి కాపాడేందుకు రూ.42 కోట్ల నిధులతో ఎమ్మెల్యే నన్నపునేని అండర్ గ్రౌండ్ డక్ట్ (భూ గర్భ వరద నీటి కాల్వ) నిర్మాణ పనులను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. 1300 మీటర్ల అండర్ గ్రౌండ్ డక్ట్, 750 మీటర్ల పొడవు రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు జరగాల్సి ఉండగా ప్రస్తుతం మొదటి విడుతలో రూ.15 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. రాతికోట అగడ్త నుంచి వచ్చే వరద నీటిని డక్ట్‌లో కలిపేందుకు రిటైనింగ్ వాల్ పనులు చేపడుతున్నారు. అగడ్త నీరు శివనగర్ వైపు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పెరుకవాడ నుంచి వరంగల్ రైల్వేస్టేషన్ సమీపం వరకు అండర్ గ్రౌండ్ డక్ట్ పనులు పూర్తి చేశారు. అలాగే, రైల్వేస్టేషన్ వెనుక నుంచి మైసయ్యనగర్ వైపు పనులు శర వేగంగా జరుగుతున్నాయి. వర్షాకాలం వరకు పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 50 మీటర్ల పనులు పూర్తి చేసిన తర్వాత మరో 50 మీటర్ల చొప్పున పనులు చేపడుతున్నారు. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లయ్‌కి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తే పనులు మరింత తర్వగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 60 శాతం భూగర్భ వరద నీటి కాల్వ పనులు పూర్తయినట్లు చెప్పారు. కేవలం శివనగర్లోనే కాకుండా నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో రూ.239 కోట్లతో పనులు చకచకా జరుగుతున్నాయి.
స్థానికుల హర్షం..
వరద ముంపు సమస్య శాశ్వతంగా తొలగిపోనుండడంతో శివనగర్‌లోని పలు కాలనీలు, మైసయ్యనగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివనగర్‌లో పరిధిలోని 34, 35 డివిజన్లలో స్మార్ట్ రోడ్లు పూర్తి చేశారు. అలాగే అండర్ బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడ్డ శివనగర్ వాసులు సంబుర పడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి..
– పోలెపాక నరేందర్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, శివనగర్
శివనగర్ సమగ్రాభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోనే సాధ్యమైంది. ఒకప్పుడు ఇక్కడి రోడ్లపై ప్రయాణం అంటే భయపడాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతి గల్లీకి స్మార్ట్ రోడ్డు వేసిండ్లు. వర్షాకాలంలో శివనగర్ ప్రాంతం మునగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ఎవరూ చేయలేని అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది.