హనుమకొండ, మే 6 : జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్‌విప్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. శనివారం హనుమకొండ బాలసముంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించి, తనపై మరింత బాధ్యత పెంచారన్నారు. ఇప్పటి వరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యానని, ఇపుడు హనుమకొండ జిల్లాలోని 14 మండలాల పరిథిలోని గ్రామాల్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ఉద్యమ సమయంలో గల్లీగల్లీ తిరిగినట్లుగా పార్టీ పటిష్టతకు మళ్లీ తిరుగుతానని వెల్లడించారు.
ఇందుకు ప్రజా ప్రతినిధుల సమక్షంలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, త్వరలోనే సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. తొమ్మిదేళ్లుగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపడంతో పాటు దేశానికి ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడో సారి సీఎం కావాలని ప్రజలు ఆకాక్షిస్తున్నారని చీఫ్‌విప్ అభిప్రాయపడ్డారు. పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అధ్యక్షుడిగా అప్పగించిన బాధ్యతల మేరకు.. జిల్లాలోని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 40 ఏడ్లుగా ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న వారి కళలను సాకారం చేసిన మహనీయడు సీఎం కేసీఆర్ అన్నారు. ఏటా మే మాసం అంతా కార్మిక దినోత్సవమేనన్నారు. అ సంఘటిత కార్మికుల సంక్షేమం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా కార్మికుల ఇన్సూరెన్స్ విషయంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కార్మికుల సంక్షేమం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో కార్మిక భవనం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెల అంతా కూడా కార్మిక, ఉద్యోగ సంక్షేమ మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజా సమస్యలు పట్టని ప్రతిపక్షాలు..
ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు వరంగల్ నగర అభివృద్ధిని అడ్డుకుం టాయన్నారు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే ప్రజా సమస్యలు, దేవుళ్లు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని, సీఎంను, మంత్రులను, ఎమ్మెల్యేలను విమర్శిస్తే తమ స్థాయి పెరుగుతుందని పొంతనలేని ఆరోపణలు, విమర్శలు చేయడం తగదన్నారు. గల్లీల్లో గుర్తిం పు లేని, కార్పొరేటర్‌గా గెలువలేని వారు పార్టీలో తమ ఉనికిని చాటుకునేందుకు అనుచిత వాఖ్యలు చేస్తున్నారన్నారు. గతంలో నగరాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ఎంత అభివృద్ధి చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో ఒక్కరోజులోనే సుమారు రూ.182 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ తొమ్మిదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది అనే చర్చకు లెక్కలతో సహా సిద్ధమని చీఫ్ విప్ సవాల్ విసిరారు. ఇప్పటికే కేటీఆర్ ప్రత్యేక చొరవతో వరంగల్‌ను ఐటీ హబ్‌గా, ఎడ్యుకేషన్ హాబ్‌గా మార్చారన్నారు. త్వరలోనే హెల్త్‌హబ్, కల్చరల్ హబ్, పర్యాటక హబ్‌గా మారబోతుందని ఆయన పేర్కొన్నారు.
వరంగల్ నగరం ఇంత అభివృద్ధి జరుగుతుంటే కళ్లున్న కబోదులుగా, ప్రతిపక్ష పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరంగల్ నగరానికి ఒక చుట్టపు చూపుగా, టూరిస్టుల వచ్చిపోతున్నాడు తప్పా నగర అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. వరంగల్ ప్రజలపై ప్రేమ, అభిమానం, దమ్ము, ధైర్యం ఉంటే విభజన చట్టంలోని కాజీపేటో కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ హామీలను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడ పాద యాత్రలు చేస్తున్న బీజేపీ నాయకులు ఢిల్లీలోని గల్లీలో చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అందుకు తాము కూడా సహకరిస్తామన్నారు. ప్రజల్లో మతచిచ్చులు పెడుతూ ఉగ్రవాదుళ్లా ప్రవర్తిస్తున్న బీజేపీ పార్టీని, నాయకులను రాబోవు రోజుల్లో భూ స్థాపితం చేయడం ఖాయమన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభను విజయవంతం చేసినందుకు భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్‌రావు, చెన్నం మధు, సోదాకిరణ్, వేముల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తాడిశెట్టి విద్యాసాగర్, పులి రజినీకాంత్, నెక్కొండ కిషన్, ఏనుగుల రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.