మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలతో రాజులకొత్తపల్లి చెరువు తెగి నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. ఇలా వరద సృష్టించిన బీభత్సంతో గ్రామంలో ప్రతి ఇంట్లోకి నడుము లోతు నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా గ్రామంలో ఐదు ఇండ్లు నేలమట్టమయ్యాయి. 25 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఇండ్లు కూలి ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా నీటిపాలయ్యాయి. 72 ఇళ్లలోకి నీరు చేసి బియ్యం బస్తాలు, పంటల సాగు కోసం తెచ్చి పెట్టుకున్న ఎరువుల బస్తాలు తడిసి ముద్దయయ్యాయి. అంతేగాక 92 గొర్రెలు, ఆటో, 2 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్ వరద నీటిలో కొట్టుకపోయాయి. ప్రస్తుతం ట్యాంకర్‌తో ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కింద 72 కుటుంబాలకు ఇంటికి 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్ రాజు తెలిపారు.
నాకున్న 80 గొర్లను సాదుకుంట బతుకుతున్న. వరద వచ్చి ఇళ్లు మొత్తం ఆగమైంది. మా నాన్న చనిపోయి నెల రోజులు మాత్రమే అయింది. మాసికం ఖర్చుల కోసం తెచ్చి ఇంట్లో దాచుకున్న రూ.60 వేల కొట్టుకపోయినయ్. నా జీవనాధారమైన 40 గొర్లు వరద ప్రవాహంలో పోయినయ్. నేను, నా పిల్లలు జీవనాధారం కోల్పోయాం. ఇప్పుడు నేనేం చేయాలె. ఎట్ల బతుకాలే.
– కడారి వీరయ్య, బాధితుడు, రావిరాల
ఒక్కసారిగా వాన వచ్చి ఇంటిని ముంచింది. వరదలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీళ్లలో మునిగిపోయాయి. మాది చాలా పేద కుంటుంబం. నీడ కో సం ఏదో చిన్నగా కట్టుకుని ఉంటున్న. మాయదారి వాన వచ్చి మమ్ముల ఆ గం చేసింది. ఆ రోజు రాత్రి ప్రాణాలు పైపైనే పోతాయనుకున్నా. తెల్లారేసరికి ఇగ నేను బతికంటనో లేదో అనుకున్నా. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికున్న. ఇప్పుడు తిందామంటే తిండిలేదు.. ఉందామంటే ఇల్లు లేదు.
– సురుగురి ఎల్లమ్మ, బాధితురాలు, రావిరాల
నాకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. అందరి పెళ్లిళ్లు అయి వేర్వేరుగా ఉంటాన్రు. నా కొడుకు హైదరాబాద్‌లో ఉంటాండు. నాకు మోకాళ్ల నొప్పులుంటే నా కొడుకు పట్నంల ఆపరేషన్ చేయించిండు. మొన్ననే పట్నం నుంచి ఇక్కడికి వచ్చిన. మొన్న రాత్రి ఒక్కసారిగా ఇంట్లకు నీళ్లచ్చినయ్. పక్కింటోళ్లు వచ్చి నన్ను తొందరతొందరగా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చిళ్లు. కొంచెం సేపటికి నా ఇళ్లు మొత్తం కూలిపో యింది. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పూర్తిగా కరాబయ్యాయి. ఉండేటందుకు ఇళ్లు లేదు. ఎవ్వలు బుక్కెడు బువ్వ పెడుతే అక్కడే తింటున్నా, అక్కడే పడుకుంటాన.
– చిప్ప నర్సమ్మ, బాధితురాలు, రావిరాల