నర్సింహులపేట, మార్చి 2 : సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో పారే ఆకేరు వాగు ఎండిపోయింది. చుక్కనీరు లేక.. కళ్ల ముందే యాసంగి వరి పంట ఎండిపోతుంటే కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వాగు నీళ్లను నమ్ముకుని యాసంగి వరి సాగు చేస్తే ఇప్పుడే తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని ముంగిమడుగు శివారులో ఉన్న చెక్‌డ్యాం తెగిపోయి వాగు పూర్తిగా ఎండిపోవడంతో చేతికి వచ్చే దశలో ఉన్న వరి పంటకు నీరందించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటకు రూ. 1500 ఖర్చు చేస్తూ జేసీబీతో వాగులో గుంతలు తవ్విస్తున్నారు. పదేళ్లలో ఇలాంటి ఇబ్బంది చూడలేదని, ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు పంటలకు నీరందించేందుకు వాగులోకి ఎస్సారెస్పీ జలాలు వదలాలని రైతులు కోరుతున్నారు.
పల్లె, పట్నం అనే తేడా లేకుండా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరందింది. పదేండ్లలో నీటి కోసం ఇబ్బంది పడిన సందర్భం లేదు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో తాగు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి ముందే స్వచ్ఛమైన నీరు పట్టుకునే స్థితి నుంచి వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని రూప్లాతండా జీపీ పరిధి మధుతండాలో వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా ఫలితం లేదని తండా వాసులు వాపోతున్నారు. వేసవి కావడంతో ఉదయమే మిరప పంట కోసేందుకు వెళ్లి వచ్చే సరికి నీరు లేకపోవడంతో పొలాల వద్దకు వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో అంతదూరం వెళ్లలేని ప్రజలు తండాకు చెందిన గుగులోత్ శంకర్ తన ఇంటి నిర్మాణం కోసం వ్యవసాయ బావి నుంచి వేసుకున్న పైపు వద్ద నీరు పట్టుకొని వెళ్తున్నారు.
వానకాలం వచ్చిన వరదలతో మూడు ఎకరాల పొలం కొట్టుకుపోయింది. దీనికి నష్టపరిహారం ఇంకా నయాపైసా రాలేదు. రూ. 25 వేలు పెట్టి పొలం చదును చేసిన. యాసంగి పంటగా వరి సాగు చేస్తే ఇప్పుడు ఆకేరు వాగులో నీరు లేక వరుస తడులు పారిస్తున్నా. వాగులో గంటకు రూ. 1500 పెట్టి జేసీబీతో గుంత తీయించినా చివరి వరకు పంటకు నీళ్లు అందుడు కష్టంగానే ఉంది. వాగులోకి నీళ్లు వచ్చేలా అధికారులు, నాయకులు చూడాలే. లేకుంటే మా పంటలు ఎండిపోవుడు తప్పదు.
– గండి విద్యాకర్‌రెడ్డి, కౌసల్యదేవిపల్లి, నర్సింహులపేట
అప్పుడే ఎండలు దంచి కొడుతున్నయి. నీరు లేక ఇబ్బంది పడుతున్నం. ఎవరికి చెప్పినా పట్టిచుకోవడం లేదు. పదేండ్ల కిందట నీళ్ల కోసం పడిన తిప్పలు ఇప్పుడు మళ్లా మొదలైనయ్. పొద్దుగాల పనికి పోయి వచ్చి ఎండలో నీళ్లు తెచ్చుకుంటున్నం. వరి పొలం పారడం లేదని రైతులు నీళ్లు పట్టుకోవద్దంటున్నరు. మనుషులం ఎక్కడో అక్కడ తాగుతం. గొడ్లు ఏట్లా బతకాలె. ఇప్పుడే ఇట్లుంటే రేపెట్లనో..ఇప్పటికైనా అధికారులు వచ్చి తాగు నీటి గోస తీర్చాలి.
– గుగులోత్ బుచ్చమ్మ, మధుతండా