కేసముద్రం : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులను గుర్తించలేదంటూ కొంత మంది ఆశావాహులు అధికారులను శనివారం నిలదీశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మురళీనాయక్ చేతుల మీదిగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఎమ్మెల్యే మురళీనాయక్ వ్యక్తి గత కారణాల వల్ల హాజరు కాలేదు. దీంతో అధికారులు, స్థానిక సింగిల్ విండో వైస్ చైర్మన్లు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం కొంత మంది అధికారులను నిలదీశారు. తాము ఇందిరమ్మ ఇండ్ల ఎంపికకు అర్హులమైనప్పటికీ మాకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు తమ ఇష్టం వచ్చిన వారికి ఇండ్లు మంజూరి చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్లు అల్లం నాగేశ్వరరావు, అంబటి మహేందర్ రెడ్డి, ఆర్డీఏ సభ్యులు రావుల మురళీ, తహసీల్దార్ వివేక్, మున్సిపల్ కమీషనర్ ప్రసన్నరాణీ, ఆర్ఎస్ఐ మజీద్, సౌజన్య, వివిధ పార్టీల నాయకులు వేముల శ్రీనివాసరెడ్డి, గుగులోత్ దస్రూనాయక్, అయూబ్ ఖాన్ తదితరులు ఉన్నారు.