నర్సింహులపేట / ఏటూరునాగారం ఆగ స్టు 1 : సీజనల్ వ్యాధులతో పల్లె జనం పడుతున్న ఇబ్బందులపై గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ‘పల్లెకు జ్వరం.. వైద్యం దూరం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. ఈమేరకు నర్సింహులపేట మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో డీపీఎంవో సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. అలాగే నర్సింహులపేటతో పాటు కొమ్ములవంచలో జ్వర బాధితులకు వైద్య పరీక్షలు చేశారు.
కొమ్ములవంచలో డెంగీ లక్షణాలతో ఒకరు వరంగల్‌లో వైద్యం పొందుతున్నారని, అతడితో పాటు గ్రామంలో చాలామంది జ్వర బాధితులు ఉన్నట్లు గుర్తించామని ఎంఎల్‌హెచ్‌పీ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం విజయ తెలిపారు. శుక్రవారం కూడా వైద్య శిబిరం కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌యూవో రామకృష్ణ, ఎంఎల్‌హెచ్‌పీ అన్వేశ్, ఏఎస్ఎం ప్రసన్న, కృష్ణవేణి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. అలాగే ఏటూరునాగారం మండలం చింతలమోరి గొత్తికోయగూడెంలో వైద్య సిబ్బంది ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు.
డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు పల్లె దవాఖాన మెడికల్ ఆఫీసర్ అన్మిషా ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే చేసి నలుగురు జ్వర పీడితులు ఉన్నట్లు గుర్తించారు. వారికి మలేరియా పరీక్షలు చేసి మందులు అందజేశారు. ప్రతి ఇంటికి దోమతెరలు అందించి వాటిని వాడే పద్ధతిని వివరించారు. పబ్లిక్ హెల్త్ చిల్డ్రన్స్ స్కూల్లో ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని దగ్గు, జలుబు ఉన్న వారికి మందులు అందించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ భాస్కర్‌రావు, ఆశ కార్యకర్త సరస్వతి పాల్గొన్నారు.