మహబూబ్‌నగర్, సెప్టెంబర్16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి మహాజరైన సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్డండ, కల్వకుర్తిల వద్ద సీఎం కాన్వాయ్‌కు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం కల్వకుర్తి మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రం శివారులో సీఎం కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్ తదితరులు స్వాగతం పలికారు. సీఎం వెంట స్వీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడే ఓ ఫంక్షన్ హాల్లో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిథులు, అధికారులు మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో కొల్లాపూర్‌కు బయలుదేరారు. కొల్లాపూర్ చౌరస్తాతోపాటు పెద్దకొత్తపల్లి, సాతాపూర్, కల్వకోలు వద్ద భారీ జనస్వాగతం పలికారు.
దారిపొడవునా బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల ఏర్పాటుతో గులాబీమయంగా మారింది. కొల్లాపూర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ నేరుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించిన ఎల్లూర్ గ్రామానికి చేరుకున్నది. అక్కడే మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితాసభర్వాల్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, సీఎన్సీ మురళీధర్‌రావు, ఛీప్ ఇంజినీర్ హమీద్‌ఖాన్, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక బస్సు నుంచి దిగిన సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిపి సీఎం కేసీఆర్ పైలాన్‌ను ఆవిష్కరించారు. పైలాన్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఫొటోలు దిగారు.
అనంతరం లిఫ్ట్‌లో కంట్రోల్ రూమ్‌కు తరలివెళ్లారు. మోటర్లను ఆన్ ఆఫ్ చేసే ప్యానెల్ వద్దకు చేరుకున్నాక ఇరిగేషన్ సలహాదారుడు పెంటారెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి బాహుబలి పంపులు డ్రైరన్, వెట్న్‌క్రు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరించారు. నిర్దేశించిన లక్ష్యంలోపే పంపులను రెడి చేశామని సీఎంకు వివరించారు. అక్కడే మోటారు స్విచ్ ఆన్ చేశారు. స్విచ్ ఆన్ చేయగానే మోటారు పంపింగ్ ప్రారంభమైంది. ఇరిగేషన్ అధికారులను ఏజెన్సీ సిబ్బందిని సీఎం అభినందించారు. అక్కడినుంచి నేరుగా నార్లాపూర్ రిజర్వాయర్‌కు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణాజలాలను నింపిన కళశాలకు పుష్పాభిషేకం చేశారు. అనంతరం కృష్ణా జలాలను వేదమంత్రోచ్ఛారణ మధ్య పసుపు, కుంకుమలకు పూజ చేసి పుష్పాభిషేకం చేశారు. మోటరు పంపు ద్వారా వస్తున్న నీటిని చూసి కెసీఆర్ ఆనందంతో పులకించిపోయారు. ఇది కదా మనం ఆశించింది.. మనం కలలు గన్నది అని వ్యాఖ్యానించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేశారు.