ఖిలావరంగల్, అక్టోబర్ 14: చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు (వరంగల్) కోట ప్రాంతవాసులు గత ఆరు రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించడంలో విఫలం కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 8వ తేదీన కేవలం ఒక గంట సమయం మాత్రమే నీటి సరఫరా జరిగింది. ఆ తర్వాత మళ్లీ నీరు రాకపోవడంతో ఆరు రోజులుగా నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో తాగునీటి కోసం స్థానికులు సమీపంలోని వాటర్ ప్లాంట్ల వద్దకు క్యూ కడుతున్నారు.
ఇదే అదునుగా రూ.10 రూపాయలు ఉన్న వాటర్ క్యాన్‌ను 20 రూపాయలు చేసి విక్రయిస్తున్నారు. నిత్య వసరాలకు నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు ఆర్థిక భారాన్ని కూడా మోయాల్సి వస్తోంది. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాల్సింది పోయి, బల్దియా అధికారులు మరో రెండు రోజులు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చని ప్రకటించడంతో ప్రజల కష్టాలు రెట్టింపు అయ్యాయి. మొత్తం ఎనిమిది రోజుల పాటు నీరు రాకపోతే తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి సమస్య పరిష్కారమయ్యేంతవరకు తక్షణ ప్రత్యామ్నాయ చర్యగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని కోట ప్రాంత ప్రజలు బల్దియా అధికారులను, స్థానిక నాయకులను డిమాండ్ చేస్తున్నారు. అధికా రులు వెంటనే స్పందించి, తాగునీటి కష్టాలను తీర్చకపోతే ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరిస్తు న్నారు. సరఫరా పైపులైన్లలో సాంకేతిక లోపం లేదా మరమ్మతులు సమస్యకు కారణంగా బల్దియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆరు రోజులుగా సమస్యను పరిష్కరించకపోవడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాగునీటిని అందించడంలో ప్రజాప్రతినిధులు విఫలం
ఖిలా వరంగల్‌లో తాగునీటిని అందించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిగా విఫలమ య్యారు. దినం తప్పించి దినం సరఫరా చేయాల్సిన తాగునీటిని మూడు రోజులు నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. కనీసం ఫోన్ చేస్తే స్పందించని సిబ్బంది. నీటి సరఫరాలో సమయపాలన పాటించడం లేదు. తాగునీటి సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తితే కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలి.
– గూడూరు దయాకర్, ఖిలావరంగల్