హనుమకొండ, నవంబర్ 12: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 9వ డివిజన్ కార్పొరేటర్ చీకటి శారద ఇంటి ఎదుటే ఇలా డ్రైనేజీ పారుతుంటే ఇక ప్రజాసమస్యలు ఏం పరిష్కరిస్తారని ప్రజలు, వాహనదారులు మండిపడుతున్నారు. నిత్యం వందలాది మంది వాహనాల ద్వారా వెళ్లే ప్రధాన రహదారి అమృత థియేటర్ జంక్షన్లో నాళా సరిగ్గాలేక కాలువ నిండిపోయి రోడ్డుపై మురుగుకాలువ ప్రవహిస్తోంది. రెండురోజులకోసారి వచ్చే నల్లా లీకేజీల ద్వారా ఇలా నీళ్లు రోడ్డుపైకి చేరడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపల్ నీటి సరఫరా వచ్చినప్పుడుల్లా ఉదయాన్నే ప్రయాణికులకు ముఖ్యంగా స్కూల్ పిల్లలకు రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది. వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నా అధికారులు, అధికార ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పలుమార్లు స్థానిక కార్పొరేటర్‌కు విన్నవించినా షరామూములే అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.