నర్సంపేట, ఫిబ్రవరి 6 : అధికారాన్ని అడ్డంపెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొద్ది మంది బ్రోకర్లను పెట్టి ప్రజలపై గూండాయిజం, రౌడీయిజం చేయిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరో పించారు. శుక్రవారం నర్సంపేటలోని 7, 8, 9, 10, 22, 23, 24, 25 వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ది మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికీ నెరవేర్చక బాకీ పడిందని మండిపడ్డారు. మోసపూరిత కాంగ్రెస్ హామీలపై ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కొద్ది మంది బ్రోకర్లు, రౌడీలు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. రెండేళ్లుగా నిధులున్నా రోడ్లు, డ్రైనేజీలు ఎందుకు వేయలేదని,
దొంతి మాధవరెడ్డి నాణ్యత లేని నాసిరకం పనులు చేయిస్తున్నాడని ఆరోపించా రు. రూ.7కోట్లతో ఆడిటోరియం సెంట్రల్ ఏసీతో నిర్మిస్తే ఇప్పటి వరకు దానిని ప్రారంభించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నల్లా మనోహర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, తక్కళ్లపెల్లి రవీందర్రావు, నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, గటిక అజయ్‌కుమార్, వేములపల్లి ప్రకాశ్‌రావు, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, గోనె యువరాజ్, మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు తదితరులున్నారు.