ములుగు, జూలై4(నమస్తేతెలంగాణ) : వాక్ స్వాతంత్య్రంలో భాగమైన ప్రశ్నించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అడిగినా, అవినీతి అక్రమాలను ప్రశ్నించినా త ప్పుడు కేసులు బనాయించి భౌతిక దాడులను చేయడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పుతున్నదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో సిటీ పోలీస్ యాక్టును ప్రకటించి సామాన్య ప్రజలపైన కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి సీతక్క ఎమర్జెన్సీ ప్రకటించిం దన్నారు.
ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, అవినీతి అక్రమాలు, భూ కబ్జాలపై ప్రశ్నించిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేయిస్తున్నదని అన్నారు. సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులపై భౌతిక దాడులు, కేసులు నమోదు చేయడం వంటి ఘటనలపై ఈ నెల 7వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రకటించిన వెంటనే మంత్రి సీతక్క ములుగు జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్టు అమలును ప్రకటింపజేసిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి సీతక్క, పోలీసులు ఎన్ని అడ్డంకులు స్పష్టించినా ప్రజాస్వామ్య బద్ధంగా ములుగు జిల్లా ప్రజల స్వేచ్ఛ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రజా నిరసన కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు. అడవిలో జీవించే గిరిజనుల ఇండ్లను కూల్చడం, వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం నిత్యకృత్యంగా మారిందని అన్నారు. అడుగడుగునా పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులతో జిల్లా ప్రజలు విసిగిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాలు, ఇసుక దందా, భూ కబ్జాలు, సోషల్ మీడియా వారియర్స్, వార్తలు రాస్తున్న పత్రికా విలేకరులపై జరుగుతున్న భౌతిక దాడులను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు.
మంత్రి సీతక్క నియోజ కవర్గంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ముఠాగా ఏర్పడి సామాన్య ప్రజలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అనర్హులకు అందిస్తున్నారని, ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని తెలిపారు. వీరి చర్యలతో ములు గు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు బలిదానం అయ్యారని అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో 7వ తేదీన ప్రజా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పార్టీ నాయకత్వంతో పాటు ములుగు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని పెద్ది తెలిపారు.