నల్లబెల్లి, ఫిబ్రవరి 10 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని తేలిపోయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రేవంత్ సర్కారు పాలనలో రైతులది భరోసాలేని బతుకైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నల్లబెల్లి మండల కేంద్రంలో చేపట్టిన నిరసన ప్రాంతానికి పెద్ది తన నివాసం నుంచి కాడెడ్ల బండిలో వచ్చి పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 179 గ్రామాల్లో 20 వేల పైచిలుకు రైతులు రోడ్లపైకి వచ్చి రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇది ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమన్నారు. ప్రధానంగా రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, రైతు కూలీలకు సాయం పేరుతో మోసం చేసిందన్నారు. ఎన్నికల కోడ్ ఉందనే సాకుతో పథకాలను నిలిపి వేయాలని ఈసీ ఆదేశాలివ్వడం ప్రభుత్వ కుట్రలో భాగమేనన్నారు. అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ. 15 వేలు వేస్తామని మాట తప్పారని, ఇప్పుడు ఎకరానికి రూ. 6 వేలు రైతు ఖాతాల్లో జమవుతాయని, సెల్ ఫోనులకు టింగ్ టింగ్ మని మెస్సేజ్‌లు వస్తాయన్నారని, అవేమీ లేవన్నారు.
అలాగే రైతు రుణమాఫీ 30 శాతం కూడా చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు సన్న ధాన్యానికే అంటూ మాట మార్చారన్నారు. ధాన్యం అమ్మి రెండు నెలలైనా ఇంతవరకు బోనస్ డబ్బులు వేయలేదన్నారు. నియోజకవర్గంలో రూ. 16.50 కోట్ల బోనస్ పెండింగ్‌లో ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాకే ఎన్నికలకు పోవాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారని పెద్ది హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ సర్పంచులు నానెబోయిన రాజారాం, మోహన్‌రెడ్డి, గందె శ్రీనివాస్‌గుప్తా, క్యాతం శ్రీనివాస్, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.