నర్సంపేట, ఫిబ్రవరి9: స్థానిక సంస్థల ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేసి గ్రామాల్లోకి రావాలని, లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం నర్సంపేటలో ఆయన మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి తీరా 50 శాతం మందికి కూడా చేయలేదన్నారు. రూ.2లక్షల పైన రుణం ఉన్న వారు మిగతా డబ్బులను బ్యాంకులకు చెల్లించి మళ్లీ అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా రూ.15 వేలిస్తామని చెప్పి రూ.12వేలకు తగ్గించడం దారుణమన్నారు.
కాంగ్రెస్ వాయిదాలతో కాలం వెల్లదీస్తుందని, పెట్టుబడి సాయానికి కోత లు పెట్టిందని ఆరోపించారు. నేటికీ రైతు భరోసా రైతు ఖాతాల్లో జమ కాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. జనవరి 26న రాజ్యాంగం అమలైన రోజు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పి రాజ్యాంగాన్ని అపవిత్రం చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమా రు 86,40,000 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించిన రూ.432 కోట్ల బోనస్ చెల్లింపులు పెండింగ్లోనే ఉన్నాయని, వాటి కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. రెండో పంటకు సిద్ధం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం తిరగాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.
ప్రైవేట్ మార్కెట్లో రూ.3వేల వరకు ధర ఉన్నా బోనస్ కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి ధాన్యాన్ని విక్రయించారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలోనే రైతులు సుభిక్షంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండగలా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో రైతులు ఆత్మహత్యల కు పాల్పడడం బాధాకరమని తెలిపారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం వెంటనే రూ.2లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15వేల రైతు భరోసా, అన్ని పంటలకు బోనస్, కౌలు రైతులకు రైతు భరోసాను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్లో ఉన్న బోనస్ డబ్బులను విడుదల చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నదన్నారు.