నర్సంపేట, ఏప్రిల్ 21 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న గులాబీ జాతరకు ఇంటికొక్కరు చొప్పున లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా ఎల్లప్పుడు అండగా ఉంటుందని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా చితికిపోయిందన్నారు. వ్యవసాయం అంటేనే కేసీఆర్ అని, అన్నదాతను ఆదుకున్న మహానుభావుడన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని 16 నెలలుగా చెబుతున్నారని, ఇప్పటి వరకు ఎక్కడా కూడా పునాది తీసిన దా ఖలాలు లేవన్నారు. ఆ పార్టీ నాయకులు కేవలం ఫొటోలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో పంట నష్టం జరిగితే జిల్లా ఇన్చార్జి మంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకు ఏమాత్రం సోయిలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయం లో రైతులకు నష్టం జరిగితే స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ వచ్చి పరిశీలించి బాధిత రైతులకు భరోసా కల్పించారన్నారు. పంటలు నష్టపోతే అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నా రు. నర్సంపేట నియోజకవర్గం నుంచి రజతోత్సవ సభకు 26 వేల మం ది తరలిరానున్నారని తెలిపారు. వారి కోసం ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, డీసీఎంలు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. 1200 భారీ వాహనాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులు తరలివస్తారని పెద్ది తెలిపారు.
సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. సభా వేదిక, పార్కింగ్ స్థలాల రూట్‌మ్యాప్‌ను అన్ని నియోజకవర్గాల నాయకులకు అందజేస్తున్నామన్నారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా అనేక దారులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సభకు వచ్చే ప్రజల సమాచారం కోసం ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పెద్ది చెప్పారు.
రైతు సమన్వయ సమితి రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్‌రెడ్డి, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మాజీ జడ్పీటీసీ బాలు, మాజీ కౌన్సిలర్లు మండల శ్రీనివాస్, దేవోజు సదానందం, బండి ప్రవీణ్, నాగిశెట్టి ప్రసాద్, శివరాత్రి స్వా మి, వెంకటేశ్వర్లు, నాయకులు పైస ప్రవీణ్‌కుమార్, నాయిని వేణుచంద్, దేవోజు హేమంత్, భీరం అనంతరెడ్డి, నల్లా రవిందర్ ఉన్నారు.
భూపాలపల్లి రూరల్/చిట్యాల, ఏప్రిల్ 21 : పదేండ్ల పాటు సుపరిపాలన కొనసాగించిన నాటి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కొనియాడారు. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సోమవారం భూపాలపల్లి మండలం మోరంచపల్లి, ఎస్ఎం కొత్తపల్లి, శ్యామ్‌నగర్, చిట్యాల మండలం దూత్‌పల్లి, లక్ష్మీపూర్‌తండా, ఒడితల, పాసిగడ్డతండా, గోపాలపూర్, కొత్తపేట, జడలపేట, నైన్పాక, వరికోల్‌పల్లి, చైన్పాక, అందుకుతండా, వెంచరామి, గిద్దెముత్తారం, కాల్వపల్లి గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఒక్కో గ్రామం నుంచి 100 మందికి తగ్గకుండా హాజరై విజయవంతం చేయాలని శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న అన్ని గ్రామాల్లో శ్రేణులు పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రజలతో కలిసి సభకు బయలుదేరాలన్నారు.
సమావేశాల్లో భూపాలపల్లి మాజీ ఎంపీపీ కల్లెపు రఘుపతిరావు, నేతలు వేణుగోపాల్‌రెడ్డి, సదానందం, చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్‌రెడ్డి, పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, మండల ప్రధాన కార్యదర్శులు ఏరుకొండ రాజేందర్, మడికొండ రవీందర్ రావు, మండల యూత్ అధ్యక్షుడు టీ నవీన్, కేటీఆర్ సేన మండలాధ్యక్షుడు టీ తిరుపతి, నాయకులు కాట్రేవుల కుమార్, హరిభూషణ్, నిమ్మగడ్డ రాంబాబు, ఐలయ్య పాల్గొన్నారు.